భారతదేశంలో రైలు ఎక్కాలంటే ముందుగా టికెట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఒకవేళ టికెట్ లేకపోతే ఫైన్స్ , అప్పుడప్పుడు క్రిమినల్ కేసెస్ ఎదుర్కోవాల్సి వస్తుందని మనందరికీ బాగా తెలుసు. కానీ, మన దేశంలోనే ఎటువంటి టికెట్ అవసరం లేకుండా, ఒక్క రూపాయి కూడా ఛార్జీ చెల్లించకుండా ఎంచక్కా రోజూ ప్రయాణించగల రైలు సర్వీస్ అందుబాటులో ఉందంటే మీరు నమ్మగలరా? వినడానికి నిజంగానే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నూటికి నూరు శాతం వాస్తవం. ఆధునిక వందే భారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్ ల జోరు కొనసాగుతున్న ఈ కాలంలోనూ, గత కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి టికెట్ ధరలు వసూలు చేయకుండా ప్రయాణికులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఒక యూనిక్ రైల్వే సర్వీస గురించిన ఆసక్తికరమైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రత్యేకమైన రైలు నిర్వహణ వెనుక ఒక చారిత్రక నేపథ్యం ఉంది. సాధారణంగా మన దేశంలోని ప్రతి ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైలును నేరుగా ఇండియన్ రైల్వేస్ నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఈ చారిత్రక రైలును మాత్రం ప్రభుత్వ రంగ సంస్థ అయిన భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ స్వయంగా ఆపరేట్ చేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుల్లో భాక్రా-నంగల్ డ్యామ్ నిర్మాణ సమయంలో, అక్కడ పని చేసే కార్మికులు, ఇంజనీర్లు, స్థానిక గ్రామాల ప్రజల రాకపోకల సౌలభ్యం కోసం ఈ రైలు సేవను ప్రారంభించారు. డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా అక్కడి ప్రజలకు ఇది ప్రధాన రవాణా మార్గంగా మారిపోయింది. ప్రైవేట్, ప్రభుత్వ రవాణా సంస్థలు ఆపరేటింగ్ కాస్ట్ పెరుగుతోందని ఛార్జీలు పెంచుతున్న ఈ రోజుల్లో, లాభాపేక్ష లేకుండా కేవలం పబ్లిక్ సర్వీస్ దృక్పథంతోనే ఈ ఉచిత రైలును కొనసాగిస్తుండటం విశేషం.
ఈ రైలు ప్రయాణం కేవలం ఉచితం మాత్రమే కాదు, రైలు ఎక్కిన ప్రతి ఒక్కరికీ ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ను అందిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఆధునిక కోచ్‌లకు భిన్నంగా ఈ రైలులో పూర్తిగా కలపతో తయారు చేసిన వింటేజ్ ఉడెన్ కోచ్‌లు ఉంటాయి. దశాబ్దాల క్రితంనాటి బ్రిటిష్ హయాం శైలిని తలపించే ఈ కలప పెట్టెలలో ప్రయాణించడం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. రైలులో ఎలాంటి సీట్ రిజర్వేషన్లు, టికెట్లు చెక్ చేసే టీటీఈలు ఉండరు. ఎవరైనా సరే ఏ సమయంలోనైనా నేరుగా రైలు ఎక్కి తమకు నచ్చిన సీటులో కూర్చోవచ్చు. ఈ అరుదైన వింటేజ్ ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదించేందుకు ప్రతిరోజూ దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా ఇక్కడికి తరలివస్తూ ఉంటారు.
భాక్రా-నంగల్ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లోని గ్రామీణ ప్రజలకు, రోజూ పాఠశాలలు, విద్యాసంస్థలకు వెళ్లే స్టూడెంట్స్‌కు , అలాగే రోజువారీ కూలీలకు ఈ రైలు సర్వీస్ ఒక సంజీవనిలా ఉపయోగపడుతోంది. సరైన రహదారి రవాణా సౌకర్యాలు లేని ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు తమ నిత్యవసర పనుల కోసం నంగల్ నుంచి భాక్రా మధ్య ప్రయాణించడానికి ఈ ఉచిత రైలుపైనే ఆధారపడుతున్నారు. డీజిల్ ధరలు, రోజూవారీ నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నప్పటికీ, సామాన్య ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత రైలును నిరంతరాయంగా నడుపుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కమ్యూనిటీ ఆధారిత సేవలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాయో చెప్పడానికి ఈ ప్రయాణ సర్వీస్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.కాలం ఎంత వేగంగా మారుతున్నా, సాంకేతికత ఎంత ముందుకు వెళ్తున్నా, సమాజ శ్రేయస్సు కోసం కొన్ని చారిత్రక సంప్రదాయాలను కాపాడుకోవడం ఎంత అవసరమో ఈ ఉచిత రైలు నిరూపిస్తోంది.
