దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. శుక్రవారం ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరంగా రికార్డు సృష్టించింది. ఇంతవరకు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న పాకిస్థాన్‌లోని లాహోర్ నగరాన్ని ఢిల్లీ అధిగమించడం ఆందోళన కలిగిస్తోంది. పొగమంచు కారణంగా నగరంలో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది.
ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత ‘ప్రమాదకర స్థాయి’కి చేరుకుంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వాయు నాణ్యత సూచీ, అంటే ఏక్యూఐ 50లోపు ఉంటే దానిని మంచి వాతావరణంగా, ఆరోగ్యానికి హాని కలిగించని పరిస్థితిగా పరిగణిస్తారు. కానీ ఢిల్లీలో ఈ స్థాయిలు ఆందోళనకరంగా మారాయి. కాలుష్య గణాంకాల విషయానికి వస్తే… అంతర్జాతీయ సంస్థల లెక్కలకు, మన దేశ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కలకు మధ్య కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’లెక్కల ప్రకారం, ఢిల్లీలో ఏక్యూఐ 334గా నమోదయింది. గాలిలోని విషపూరిత పదార్థాల ఆధారంగా దీనిని గణించారు. ఈ లెక్కల ప్రకారం గాలి నాణ్యత ‘ప్రమాదకర స్థాయి’లో ఉందని, ఆ కారణంగానే ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారిందని ఐక్యూ ఎయిర్ స్పష్టం చేసింది. మరోవైపు, మన ప్రభుత్వ సంస్థ అయిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మాత్రం ఢిల్లీలో ఏక్యూఐ 403గా నమోదయిందని వెల్లడించింది. దీనిని ‘తీవ్రమైన స్థాయి’గా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. అంతర్జాతీయ సంస్థ కంటే మన దేశ సంస్థ ప్రకటించిన పాయింట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, తీవ్రత స్థాయి మాత్రం వేరుగా ఉంది.
కాలుష్యాన్ని లెక్కించే విధానంలో, ప్రమాణాలలో తేడాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఐక్యూ ఎయిర్ సంస్థ 334 పాయింట్లకే ‘ప్రమాదకర స్థాయి’ అని ప్రకటించగా, భారత లెక్కల ప్రకారం ఏక్యూఐ 403 పాయింట్లుగా ఎక్కువగా నమోదైనప్పటికీ, దానిని ‘తీవ్రమైన స్థాయిగా మాత్రమే పరిగణించారు. ఏది ఏమైనా, ఢిల్లీ గాలి నాణ్యత మాత్రం ప్రజల ప్రాణాల మీదకు తెచ్చేలా మారిందన్నది వాస్తవం. ఈ కాలుష్య తీవ్రత ఢిల్లీ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లేవారు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ విషపూరిత గాలిని పీల్చడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. కళ్ల మంటలు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, బయటకు వస్తే తప్పనిసరిగా ఎన్-95 మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి ఏటా శీతాకాలం ప్రారంభంలో ఢిల్లీకి ఈ కాలుష్య కష్టాలు తప్పడం లేదు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం, వాహనాల పొగ, నిర్మాణ పనుల వల్ల వచ్చే దుమ్ము, వాతావరణ మార్పులు ఢిల్లీని గ్యాస్ ఛాంబర్లా మారుస్తున్నాయి. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో ఫలితాలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. కృత్రిమ వర్షాలు, నీటిని చల్లడం వంటి తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళికలతో కాలుష్యాన్ని అరికట్టాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగితే, ఈ పొగమంచు, కాలుష్యం ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
