ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను అతి తక్కువ ధరకే సబ్సిడీ ప్రాతిపదికన అందించాలని నిర్ణయం తీసుకుంది. ఎల్‌నివో ప్రభావంతో దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతున్నాయి. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారంగా మారుతున్నాయి. నెలవారీ ఇంటి ఖర్చుల కోసం ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది. దీని నుంచి సామాన్య ప్రజలకు కొంత ఆర్థిక ఊరట కల్పించాలనే లక్ష్యంతో కిరాణా సరుకులను తక్కువ ధరకే రేషన్ షాపుల ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యంనే కాకుండా కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్ వంటివి కూడా అందించనుంది.
డిసెంబర్ 1వ తేదీ నుంచి నిత్యావసర సరుకులను కూడా సబ్సిడీ ధరకు ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు ధరలను కూడా ఫిక్స్ చేసింది. కిలో కందిపప్పును రూ.100కు అందించనుంది. రిటైల్ మార్కెట్లో ఇదే కందిపప్పు ధర కిలోకు రూ.170 నుండి రూ.200 వరకు పలుకుతోంది. కానీ షాపుల ద్వారా కేవలం రూ.100కే అందించనుంది. కిలో గోధుమపిండిని రూ.25కు, లీటర్ పామాయిల్‌ను రూ.125కు విక్రయించనున్నారు. ఈ మూడు వస్తువులను నిర్ణయించిన పరిమాణంలో కొనుగోలు చేస్తే మొత్తం రూ.250కే పొందవచ్చు. అయితే లబ్దిదారులందరికీ అందించాలనే లక్ష్యంతో కొన్ని పరిమితులు విధించారు. ప్రతి రేషన్ కార్డుకు నెలకు ఒక కిలో కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్ చొప్పున పంపిణీ చేయనున్నారు.
ఇక గోధుమపిండికి సంబంధించి నెలవారీ కోటా పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. నిల్వలను బట్టి వచ్చిన వారికి ప్రాధాన్యత ఆధారంగా గోధుమపిండిని పంపిణీ చేయనున్నారు. మూడు నెలల పాటు ఈ రాయితీ సరుకులను సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఇది అమలు చేసేందుకు రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. మూడు నెలలకు కలిపి సుమారు రూ.300 కోట్లకు పైగా రాయితీ భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు ప్రభుత్వం మరికొన్ని కార్యక్రమాలను కూడా కొనసాగిస్తోంది. రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తోంది. ఆధార్ కార్డు తీసుకెళ్లి వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. అలాగే రైతు బజార్లలో ధరణి బ్రాండ్ సన్న బియ్యంను తక్కువ ధరకే అందిస్తోంది. బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ప్రజలపై భారం తగ్గించేందుకు బియ్యం గరిష్ట ధరలను ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరల్లోపే వ్యాపారులు విక్రయించాల్సి ఉంటుంది.
సబ్సిడీ సరుకుల పంపిణీ విషయంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 1వ తేదీ కంటే ముందే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్ నిల్వలు చేరుకునేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ-పాస్ యంత్రాల ద్వారా పారదర్శకంగా సరుకులు పంపిణీ చేయాలని, లబ్ధిదారులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూడాలని రేషన్ డీలర్లకు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇక బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే వ్యాపారులపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ నిల్వలను అరికట్టేందుకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరల కంటే ఎక్కువకు బియ్యం విక్రయించినా, సబ్సిడీ సరుకులను పక్కదారి పట్టించినా కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న తమకు, కేవలం 250 రూపాయలకే మూడు కీలక వస్తువులు అందడం పెద్ద ఊరటనిస్తుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది రేషన్ కార్డుదారులకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
