శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం.
రికార్డు విరాళమిచ్చిన వర్ధమాన్ జైన్.
ఏడుకొండలవాడికి 45 స్వర్ణాభరణాల కానుక.
సీఎం సమక్షంలో ఆభరణాల సమర్పణ.
రంగనాయక మండపంలో స్వర్ణ ప్రదర్శన.
మూలవిరాట్టుకు కిరీటం, శంఖుచక్రాలు సిద్ధం.
శ్రీవారి దర్శనం అనంతరం సీఎం సమీక్ష.
తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో సంచలన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. టీటీడీ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ ఇవ్వని రీతిలో… ఏకంగా 121 కిలోల బంగారంతో తయారు చేసిన 45 స్వర్ణాభరణాలు ఏడుకొండలవాడికి కానుకగా అందనున్నాయి. తన కంపెనీ వాటాల విక్రయం ద్వారా వచ్చిన భారీ మొత్తానికి కృతజ్ఞతగా చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ ఈ మహా విరాళాన్ని సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగనున్న ఈ భారీ కానుకల సమర్పణ వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు అందిస్తున్న భారీ కానుక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 121 కిలోల స్వచ్ఛమైన బంగారంతో చేయించిన 45 రకాల ఆభరణాలు శ్రీవారి ఖజానాకు చేరబోతున్నాయి. టీటీడీ చరిత్రలో ఒకే భక్తుడు ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి. అయితే, ఇంతటి భారీ విరాళం ఇస్తున్న ఆ దాత ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన పేరు వర్ధమాన్ జైన్. చెన్నైకి చెందిన ఈ పారిశ్రామికవేత్త కాసేపటి క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
గతంలో తన కంపెనీలో 60 శాతం వాటాను విక్రయించగా రూ. 6 వేల కోట్లు వచ్చాయని, ఆ దైవకృపకు కృతజ్ఞతగా అందులో నుంచి 121 కిలోల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతేడాదే వెల్లడించారు. మొదట్లో తన పేరును గోప్యంగా ఉంచాలని భావించినా, ఇప్పుడు ఆ దాత వివరాలు బయటకు రావడంతో ఆయన భక్తిని అందరూ కొనియాడుతున్నారు. టీటీడీ అర్చకులు, బొక్కసం అధికారుల సూచనల మేరకు ఓ ప్రముఖ ఆభరణాల సంస్థ వీటిని అత్యంత నైపుణ్యంతో రూపొందించింది.
ఈ 121 కిలోల బంగారు సెట్టులో శ్రీవారి మూలవిరాట్టు అలంకరణకు ఉపయోగించే 45 రకాల ఆభరణాలు ఉన్నాయి. వీటిలో బంగారు కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు, వడ్డాణం, పాదుకలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే తిరుపతి చేరుకున్న ఈ ఆభరణాలను, గురువారం ఉదయం భారీ భద్రత మధ్య తిరుమల కొండకు తరలించారు. ఆలయంలోని రంగనాయక మండపంలో వీటిని ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వర్ధమాన్ జైన్ కుటుంబం ఈ స్వర్ణాభరణాలను టీటీడీకి అందజేయనుంది. ఉదయం 10.45 గంటలకు తిరుమలలోని గాయత్రి అతిథిగృహానికి చేరుకోనున్న సీఎం… వైకుంఠం క్యూకాంప్లెక్స్ మీదుగా శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఆభరణాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొని, ఆ తర్వాత వైకుంఠ ద్వార దర్శనాలు, భక్తుల సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
ప్రస్తుతం శ్రీవారి వద్ద మూలవిరాట్టు, ఉత్సవమూర్తుల అలంకరణ కోసం దాదాపు 650 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వజ్రాలు, రత్నాల విలువతో కలిపి వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 10 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. పురాణాల ప్రకారం ఆకాశరాజు మొదటిసారి కిరీటం ఇవ్వగా, 12వ శతాబ్దం నుంచి రాజులు భారీగా ఆభరణాలు సమర్పించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇప్పుడు వర్ధమాన్ జైన్ సమర్పిస్తున్న ఈ 121 కిలోల నూతన ఆభరణాల చేరికతో శ్రీవారి ఆభరణాల సంపద మరింత పెరగనుంది.
వ్యాపారంలో వచ్చిన రూ. 6 వేల కోట్లలో ఇంత భారీ మొత్తాన్ని స్వామివారి సేవకు అంకితం చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అటు సీఎం పర్యటన, ఇటు రికార్డు స్థాయి బంగారు కానుకల సమర్పణతో తిరుమల గిరులు సందడిగా మారాయి.
