ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం… ఆ రహదారిని అగ్నిగుండంగా మార్చేసింది. ఆయిల్ తీసుకెళ్తున్న భారీ ట్యాంకర్ బోల్తా పడటంతో రోడ్డంతా చమురు ఏరులై పారింది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. కళ్లముందే 30 మంది సజీవ దహనమయ్యారు. వంద మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు.
ఈజిప్ట్ రాజధాని కైరో సిటీలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఆయిల్ నింపుకుని వెళ్తున్న ఓ భారీ ట్యాంకర్ ఆ రహదారిపై మలుపు తీసుకుంటోంది. సరిగ్గా అదే సమయంలో ట్యాంకర్ స్టీరింగ్ తిరగలేదు. అదుపు తప్పిన ఆ భారీ వాహనం ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. ట్యాంకర్ పగిలిపోవడంతో అందులో ఉన్న వేల లీటర్ల చమురు రహదారి అంతా వేగంగా వ్యాపించింది. వెంటనే ఆ చమురుకు నిప్పు అంటుకుంది. అప్పటికే ఆ రహదారిపై వెళ్తున్న వాహనదారులకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే మంటలు చుట్టుముట్టాయి. రెండు డజన్లకు పైగానే కార్లు, మోటార్‌సైకిళ్లు ఆ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదయ్యాయి.దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ, ఎగిసిపడుతున్న అగ్నికీలలతో భయానక వాతావరణం ఏర్పడింది. కార్లలో చిక్కుకున్న ప్రయాణికులు ప్రాణభయంతో బయటకు రావడానికి ప్రయత్నించారు. మంటల నుంచి బయటకు వస్తూ తమను కాపాడాలంటూ వారు పెట్టిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. చుట్టుపక్కల ఉన్న స్థానికులు ప్రాణాలకు తెగించి చాలామందిని మంటల నుంచి బయటకు లాగి కాపాడారు. ఇక ఈ ప్రమాదంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరుకోవడంతో, మృతులను గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఇక ప్రమాద సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పరిస్థితి తీవ్రత ఎంతలా ఉందంటే.. సహాయక చర్యల కోసం ఏకంగా 40 అంబులెన్సులను రంగంలోకి దించారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇఖ ఈ ఘటనపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్-ఫతా అల్-సిసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
ఇక పోతే ప్రతి ఏడాది ఈజిప్ట్‌లో రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ దేశం రోడ్డు భద్రత రికార్డు చాలా అధ్వాన్నంగా ఉందనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. అతివేగం, అధ్వాన్నమైన రోడ్లు, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం, భారీ వాహనాల ఫిట్‌నెస్‌పై పర్యవేక్షణ లేకపోవడం ఇలాంటి ఘోరాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఇదే ఏడాది జనవరిలో ఈజిప్ట్‌లోని బెని సుయెఫ్ సమీపంలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 21 మంది మరణించారు. రహదారి భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోతే, సామాన్యుల ప్రయాణాలు ఇలాగే మృత్యుపాశాలుగా మారే ప్రమాదం ఉంది.
కైరో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదం మరోసారి రహదారి భద్రత, వాహనాల నిర్వహణ ఎంత ముఖ్యమో గుర్తుచేసింది. స్టీరింగ్ లోపం, నిబంధనల ఉల్లంఘన కారణంగా 30 కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోయాయి.
