234 నియోజకవర్గాల్లో భారీ నెట్‌వర్క్
సేవ ముసుగులో పొలిటికల్ స్కెచ్
మహిళా ఓటర్లే ధనుష్ అసలు టార్గెట్
2027 లోకల్ ఎన్నికలతో ఎంట్రీ పక్కా
2031 అసెంబ్లీ ఎన్నికలే అసలు లక్ష్యం
తమిళనాడు పాలిటిక్స్‌కు మళ్లీ సినిమా ఫీవర్ పట్టుకుంది! మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ తన ‘టీవీకే’ పార్టీతో సంచలనం సృష్టించి ఏకంగా సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఆ వేడి ఇంకా చల్లారకముందే, ఇప్పుడు కోలీవుడ్‌లో మరో స్టార్ హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న 43 ఏళ్ల నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, తన ఫ్యాన్స్ అసోసియేషన్‌ను ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (సంక్షేమ ఉద్యమం)గా మార్చేశాడు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో దీన్ని విస్తరించే పనిలో పడ్డాడు. అసలు దీని వెనుక ధనుష్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? నిజంగానే పార్టీ పెడితే సీఎం విజయ్‌కు గట్టి పోటీ ఇవ్వగలడా? తమిళ ఓటర్లు మరో హీరోని తమ లీడర్‌గా ఒప్పుకుంటారా?
తమిళనాట సినిమాకూ, రాజకీయాలకూ విడదీయరాని బంధం ఉంది. ఒకప్పుడు ఎంజీఆర్, జయలలిత లాగే, ఇప్పుడు విజయ్ కూడా దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెట్టి పవర్‌లోకి వచ్చాడు. కరెక్ట్‌గా ఇదే టైమ్‌లో ధనుష్ వేస్తున్న అడుగులు తమిళ పాలిటిక్స్‌లో కొత్త ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అక్టోబర్ 14న కోయంబత్తూరులో జిల్లా నేతలతో మీటింగ్ పెట్టిన ధనుష్, తన ఫ్యాన్స్ క్లబ్‌ను ఒక సేవా సంస్థగా మార్చాడు. ఇప్పటివరకు ఉన్న 58 సంస్థాగత జిల్లాలను వందకు పైగా పెంచి, రాష్ట్రంలోని 38 రెవెన్యూ జిల్లాలు, 234 నియోజకవర్గాల్లో గట్టి నెట్‌వర్క్ నిర్మించాలని తన వాళ్లకు దిశానిర్దేశం చేశాడు.
ఈ మొత్తం ప్లాన్‌లో అందరి కళ్లు ‘మహిళా ఓటు బ్యాంకు’ మీదే ఉన్నాయి. అక్టోబర్ 25న చెన్నైలో జరిగిన మహిళా విభాగం మీటింగ్‌కు భారీగా మహిళలు తరలిరావడం వెనుక పక్కా స్ట్రాటజీ కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు ఏ పార్టీ గెలవాలన్నా మహిళా ఓటర్లే కీలకం. విజయ్‌కు యూత్‌లో పిచ్చ క్రేజ్ ఉంటే, ధనుష్ మాత్రం ‘అసురన్’, ‘తిరుచిత్రంబలం’ లాంటి ఫ్యామిలీ సినిమాలతో మహిళలకు, మిడిల్ క్లాస్ జనాలకు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆ ఇమేజ్‌నే ఓట్లుగా మార్చుకోవాలని చూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
గతంలో 2021 లోకల్ బాడీ ఎన్నికల్లో విజయ్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున అభ్యర్థులను నిలబెట్టి, గ్రౌండ్ లెవల్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు ధనుష్ టీమ్ కూడా సేమ్ అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
2027లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సంఘం లీడర్లను పోటీ చేయించి, జనంలో తమకున్న బలం ఎంతో టెస్ట్ చేసుకోవాలని చూస్తున్నారట. ఆ తర్వాత 2031 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక పూర్తిస్థాయి పొలిటికల్ పవర్‌గా ఎదగాలని స్కెచ్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అధికార టీవీకేతో పాటు డీఎంకే, ఏఐఏడీఎంకే నేతలు కూడా ధనుష్ కదలికలపై రియాక్ట్ అవుతుండటం ఈ ప్రచారానికి మరింత బలం ఇస్తోంది.
అయితే, ధనుష్ అనుకున్నంత ఈజీగా ఇక్కడ పనులు జరగవు. విజయ్ ఏళ్ల తరబడి పక్కా ప్లాన్‌తో గ్రౌండ్ వర్క్ చేసి, తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పి ఫుల్ టైమ్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు. కానీ ధనుష్ ఇప్పటివరకు రాజకీయాలపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. కేవలం ఫ్యాన్స్ బలంతోనే దశాబ్దాల చరిత్ర, బలమైన కేడర్ ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను.. అలాగే పవర్‌లో ఉన్న విజయ్‌ను ఎదుర్కోవడం మామూలు విషయం కాదు.
మొత్తానికి ధనుష్ వేస్తున్న ప్రతి అడుగు వెనుక ఒక క్లియర్ పొలిటికల్ రోడ్‌మ్యాప్ అయితే కనిపిస్తోంది. మరి ప్రస్తుతం జరుగుతున్న ఈ నెట్‌వర్క్ విస్తరణ కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితమవుతుందా? లేక 2027 లోకల్ ఎన్నికలతో ఎంట్రీ ఇచ్చి, 2031 నాటికి తమిళనాడు రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయ శక్తిగా మారతాడా? అనేది తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాలి
