మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య నెలకొన్న కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు బహిరంగంగా రచ్చకెక్కింది. బెంగళూరులోని ప్రతిష్టాత్మక యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల ప్రవేశాన్ని నిషేధిస్తూ దేవనహళ్లి సివిల్ కోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో, ఆదివారం ప్యాలెస్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా చోటుచేసుకున్నాయి.
ఆదివారం సాయంత్రం షర్మిల తన తల్లి విజయమ్మ, కుమారుడు, కుమార్తెతో కలిసి బెంగళూరుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే యలహంక పోలీసులు వారికి భద్రత ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి లీలాప్యాలెస్ హోటల్‌కు బయలుదేరిన షర్మిల, మార్గమధ్యలో యలహంక ప్యాలెస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ప్యాలెస్ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.
దీంతో షర్మిల పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అయితే, లీలాప్యాలెస్ హోటల్‌కు వెళ్లేందుకు పూర్తి స్థాయిలో జడ్ ప్లస్ భద్రత కల్పిస్తామని, కానీ యలహంక ప్యాలెస్‌లోకి గానీ, ఆ మార్గంలోకి గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని పోలీసులు తెగేసి చెప్పారు. గత్యంతరం లేక షర్మిల అక్కడి నుంచి లీలాప్యాలెస్ హోటల్‌కు వెళ్లిపోయారు. కాగా, తన కుమార్తె వివాహ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు ఇదే హోటల్‌లో నిర్వహిస్తున్నారు.
మరోవైపు, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున భీమిశెట్టి రమేశ్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలివ్వగా, తదుపరి విచారణ ఇవాళ జరగనుంది.
ఈ ఆస్తి వివాదంపై నేడు దేవనహళ్లి సివిల్ కోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. యలహంక ప్యాలెస్ వాటాలకు సంబంధించిన అంశంపై ఇరుపక్షాల వాదనలు వినేందుకు కోర్టు సోమవారం అవకాశం కల్పించింది. ఈ విచారణలో షర్మిల తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు. అలాగే, శనివారం జారీ చేసిన మధ్యంతర తీర్పుపై అభ్యంతరాలను దాఖలు చేసేందుకు డిసెంబర్ 19న కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం షర్మిల తరఫు న్యాయవాదులను ఆదేశించింది.
బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వద్ద జరిగిన ఈ హైడ్రామా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. కొంతకాలంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. సరస్వతి పవర్ షేర్లతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు బెంగళూరులోని అత్యంత విలువైన యలహంక ప్యాలెస్ వరకు చేరింది.ఒకవైపు షర్మిల తన కుమార్తె వివాహ వేడుకల పనుల్లో నిమగ్నమై ఉండగా, సరిగ్గా ఇదే సమయంలో ప్యాలెస్‌లోకి ప్రవేశం లేదంటూ కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తల్లి విజయమ్మ సమక్షంలోనే షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం, నడిరోడ్డుపై వాగ్వాదం జరగడం వైఎస్ అభిమానులను సైతం విస్మయానికి గురిచేసింది.
ఇక అందరి దృష్టి నేడు దేవనహళ్లి సివిల్ కోర్టులో జరగబోయే విచారణపైనే నెలకొంది. సిలికాన్ బిల్డర్స్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను సవాల్ చేస్తూ, షర్మిల తరఫు న్యాయవాదులు నేడు బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ప్యాలెస్‌లో తమకున్న హక్కులు, గత ఒప్పందాలకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచే అవకాశం ఉంది. కోర్టు శనివారం ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ఎత్తివేస్తుందా? లేక యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
