భారతీయ రైల్వేలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న నిరుద్యోగ యువతకు ఇదొక కీలక అలర్ట్! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తుల గడువు ముగింపు దశకు చేరుకుంది. అప్లై చేసుకోవడానికి చేతిలో కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం ఎలా ఉందో ఇప్పుడు వివరంగా చూద్దాం.”
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ రైల్వేలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా మొత్తం 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొత్తం ఖాళీలలో 133 పోస్టులను మాజీ సైనికుల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. అక్టోబర్ 27న ప్రారంభమైన ఈ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ, నవంబర్ 25వ తేదీతో ముగియనుంది. అంటే దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అయితే, దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్థులు ఫీజు చెల్లించడానికి మాత్రం నవంబర్ 27వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక ఈ పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి విషయానికి వస్తే… గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. నవంబర్ 25, 2026 నాటికి అభ్యర్థుల డిగ్రీ తుది ఫలితాలు వెలువడి ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అనర్హులు. వయోపరిమితి విషయానికి వస్తే… 2027 జనవరి 1వ తేదీ నాటికి అభ్యర్థుల 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ ఇతర రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అయితే, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని కీలక నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా వైద్య ప్రమాణాలు మరియు దరఖాస్తు విధానంపై బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్టేషన్ మాస్టర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో సింగిల్-స్టేజ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అంటే సీబీటీ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ , సీబీఏటీ ఉంటుంది. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ద్వారా తుది ఎంపిక చేస్తారు. మెరిట్ జాబితా రూపకల్పనలో సీబీటీ మార్కులకు 70 శాతం వెయిటేజీ, సీబీఏటీ మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు పే-లెవల్ 6 ప్రకారం నెలకు 35 వేల 400 రూపాయల ప్రాథమిక వేతనంతో పాటు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.ఇక అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే… దేశవ్యాప్తంగా ఏదైనా ఒక ఆర్ఆర్బీ జోన్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే, ఆ అభ్యర్థి దరఖాస్తులన్నింటినీ తక్షణమే తిరస్కరిస్తామని బోర్డు హెచ్చరించింది. అలాగే, స్టేషన్ మాస్టర్ అనేది రైళ్ల రాకపోకలను పర్యవేక్షించే అత్యంత బాధ్యతాయుతమైన ఉద్యోగం కాబట్టి, ఈ పోస్టులకు వైద్య ప్రమాణాలు తప్పనిసరి చేశారు. కంటి చూపు విషయంలో కఠిన నిబంధనలు ఉన్నాయి. గతంలో లాసిక్ లేదా ఇతర కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు పూర్తిగా అనర్హులని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలిపారు.
