హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్ ఈకో పార్క్ సమీపంలో ఎంఐఎం నేతను గుర్తు తెలియని దుండుగుల కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎంఐఎం నేత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ పరిధిలో ఉన్న హిమాయత్ సాగర్ ఈకో పార్క్ సమీపంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎంఐఎం పార్టీ నాయకుడు ముర్తుజ పైల్వాన్పై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ముందుగానే రెక్కీ నిర్వహించి, అక్కడ మాటువేసిన దుండగులు, ముర్తుజ పైల్వాన్ను చుట్టుముట్టి పదునైన కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ఊహించని ఈ ఆకస్మిక దాడితో ఆయనకు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. కళ్లముందే జరిగిన ఈ భయానక దృశ్యాలను చూసిన స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా షాక్కు గురై భయంతో పరుగులు తీశారు.
దుండగులు కత్తులతో అత్యంత కిరాతకంగా పొడవడంతో ముర్తుజ పైల్వాన్ ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన ఆయనకు అధిక మొత్తంలో రక్తస్రావం కావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, సన్నిహితులు హుటాహుటిన ఆయనను చికిత్స నిమిత్తం అత్తాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుకున్న ముర్తుజ పైల్వాన్ను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు.
వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, తీవ్ర రక్తస్రావం, లోతైన కత్తిపోట్ల గాయాల కారణంగా ముర్తుజ పైల్వాన్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుడు ఎంఐఎం పార్టీకి చెందిన క్రియాశీలక వ్యక్తిగా గుర్తించడంతో, ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో ఈ హత్య వార్త దావానంలా వ్యాపించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆసుపత్రి, పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తును ముమ్మరం చేశారు. పాత కక్షలే ఈ దారుణానికి కారణమా, లేక ఏవైనా ఆర్థిక, భూ వివాదాలు ఉన్నాయా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. హిమాయత్ సాగర్ ఈకో పార్క్ సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ, నిందితుల కదలికలను ట్రాక్ చేసే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. త్వరలోనే ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
