వాటర్ బాటిళ్లలో విషం దాగుందా?
బిస్లరీ వివాదంతో FSSAI దేశవ్యాప్త తనిఖీలు!
అన్ని బ్రాండ్ల వాటర్ శాంపిల్స్ ల్యాబ్‌కు!
అసలు బ్రాండ్ల తరహా లేబుళ్లపై అధికారుల కొరడా!
ఏ విచారణకైనా సిద్ధమన్న బిస్లరీ సంస్థ!
కలుషిత నీటితో కిడ్నీ, జీర్ణకోశ వ్యాధుల ముప్పు!
బాటిల్ కొనే ముందు FSSAI, ISI మార్క్ చెక్ చేయండి!
మనం బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే టక్కున కొనేది వాటర్ బాటిల్. ‘అబ్బే, మామూలు నీళ్లు తాగితే రోగాలు వస్తాయి.. బ్రాండెడ్ మినరల్ వాటర్ అయితేనే సేఫ్’ అని ధీమాగా తాగేస్తాం. కానీ, మనం ప్రాణప్రదంగా నమ్మే ఆ బ్రాండెడ్ వాటర్ బాటిళ్లలోనే విషం దాగుందా? అవును.. మీరు వింటున్నది నిజమే! ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ ‘బిస్లరీ’ చుట్టూ రేగిన వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. అసలు మనం తాగే నీళ్లలో ఏముంది? గల్లీ నుంచి ఢిల్లీ దాకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ కంపెనీల కథేంటి? ఇప్పుడే చూద్దాం..”
గోవాలోని బిస్లరీ ప్లాంట్ నుంచి సేకరించిన తాగునీటి నమూనాలను భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ పరీక్షించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నీటిలో ఉండాల్సిన పరిమితి కంటే ఎక్కువగా ‘బ్రోమేట్’ అనే రసాయనం ఉన్నట్లు తేలింది. లీటరు నీటిలో 10 మైక్రోగ్రాముల లోపు ఉండాల్సిన ఈ రసాయనం, 12 మైక్రోగ్రాములు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, కంపెనీ అభ్యర్థన మేరకు రిఫరల్ ల్యాబ్‌లో మరోసారి పరీక్షించగా.. అందులో ‘పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ అనే మరో హానికర రసాయనం బయటపడింది. దీంతో ఈ నీరు తాగడానికి సురక్షితం కాదని నిర్ధారిస్తూ, బిస్లరీపై విచారణకు FSSAI అనుమతి మంజూరు చేసింది.
దాహం తీర్చుకోవడానికి మనం జేబులోంచి ఇరవై రూపాయలు తీసి కొనే వాటర్ బాటిల్ ఎంతవరకు సురక్షితం? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ భయపెడుతోంది. ప్రముఖ వాటర్ బ్రాండ్ బిస్లరీ నాణ్యతపై అనుమానాలు తలెత్తడంతో.. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) దేశవ్యాప్తంగా తన తనిఖీలను ముమ్మరం చేసింది. కేవలం బిస్లరీ మాత్రమే కాదు.. మార్కెట్లో దొరికే అన్ని రకాల వాటర్ బాటిళ్లపై అధికారులు నిఘా పెట్టారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేసి, వివిధ కంపెనీలకు చెందిన వాటర్ శాంపిల్స్‌ను రాండమ్‌గా సేకరించారు. ఈ శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపించారు. త్వరలోనే ఈ టెస్ట్ రిపోర్టులు బయటకు రానున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించని కంపెనీల భరతం పట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.”
ఇక్కడ అసలు సమస్య రెండు రకాలుగా ఉంది. ఒకటి.. అసలు బ్రాండ్ల నాణ్యతైతే, రెండోది.. నకిలీ బ్రాండ్ల దందా! మనం మార్కెట్లో ఎక్కువగా చూసే కిన్లే, ఆక్వాఫినా, బెయిలీ, రైల్ నీర్, ఆక్వా ష్యూర్ వంటి పెద్ద కంపెనీల నీళ్ల నాణ్యతపైనా ఇప్పుడు చర్చ జరుగుతోంది. పెద్ద కంపెనీల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ మాత్రం అనుమతులు లేకుండా, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లోకల్, డొల్ల కంపెనీల పరిస్థితి ఏంటి? మరో దారుణమైన విషయం ఏంటంటే.. బిస్లరీ, కిన్లే వంటి ప్రముఖ కంపెనీల పేర్లను, రంగులను, లేబుళ్లను పోలి ఉండేలా నకిలీ బాటిళ్లను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. అక్షరాల్లో చిన్న మార్పు చేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి నకిలీ కంపెనీల తాట తీస్తామని FSSAI గట్టిగా హెచ్చరిస్తోంది.”
మరోవైపు, ఈ వివాదంపై బిస్లరీ సంస్థ స్పందిస్తూ.. గత ఏడాది సెప్టెంబర్‌లో గోవా ప్లాంట్ నుంచి సేకరించిన ఆరు నమూనాల్లో కేవలం ఒక్క బ్యాచ్‌లో మాత్రమే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. తాము అన్ని రకాల అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తామని, వినియోగదారుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని తెలిపింది. ఎలాంటి విచారణకైనా, మరోసారి పరీక్షలు చేయించుకోవడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే, ఈ కలుషిత నీటిపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన శుద్ధి లేని నీరు, ప్లాస్టిక్ బాటిళ్లు ఎండలో ఉండటం వల్ల అందులోకి చేరే మైక్రోప్లాస్టిక్స్, రసాయనాల వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అధికారులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.”
చూశారు కదా.. మరి ఇంత జరుగుతుంటే అసలు బాటిల్ వాటర్ తాగాలా? వద్దా? అనే సందేహం మీకు రావచ్చు. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బాటిల్ నీళ్లు కొనాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించండి. బాటిల్ కొనే ముందు దానిపై FSSAI లైసెన్స్ నంబర్, ISI మార్క్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. బ్రాండ్ పేరు స్పెల్లింగ్ సరిగ్గా ఉందో లేదో గమనించండి బాటిల్ సీల్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చూడండి. నీళ్లు తాగాక బాటిల్‌ను నలిపేయండి తద్వారా ఆ బాటిల్‌ను మళ్లీ రీ-ఫిల్ చేయకుండా అడ్డుకోవచ్చు.
అన్నింటికంటే ముఖ్యంగా.. వీలైనంత వరకు ఇంటి నుంచే స్టీల్ లేదా రాగి బాటిళ్లలో కాచి చల్లార్చిన నీటిని వెంట తీసుకెళ్లడం ఎంతో ఉత్తమం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఉండండి..
