ఛత్తీస్‌గఢ్‌లోని ఒక మారుమూల గిరిజన గ్రామంలో ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు అందరినీ వణికిస్తోంది. అడవి నుంచి నేరుగా ఓ పెళ్లింట్లోకి దూసుకొచ్చిన నాలుగు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. పెళ్లి ఇంటిలో ఉన్న పెళ్లి భోజనంతో తినేయడంతో పాటు ఆ ఇళ్లును ధ్వంసం చేశాయి. దీంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు గ్రామస్తులంతా రాత్రంతా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆ భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దట్టమైన అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న కేశ్‌మర్దా గ్రామంలో బైగా గిరిజన కుటుంబానికి చెందిన పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరుగుతోంది. తమ సంప్రదాయ ఆచారాల ప్రకారం ఊరంతా ఒక్కచోట చేరి ఆటపాటలతో, సంతోషంగా వేడుకల్లో మునిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో, దట్టమైన అడవి వైపు నుంచి భయంకరమైన ఏనుగుల భీకర శబ్ధాలు వినిపించాయి. గ్రామస్తులు తేరుకునే లోపే, క్షణాల్లోనే నాలుగు భారీ ఏనుగులు వేగంగా దూసుకొచ్చి నేరుగా ఆ పెళ్లి ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించాయి. కళ్లముందే అంత పెద్ద గజరాజులను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం చేయాలో తోచక, ప్రాణాలు దక్కించుకోవడానికి ఎటువైపు దారి దొరికితే అటువైపు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. సంతోషంగా సాగుతున్న వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కాస్తా ఒక్క నిమిషంలోనే ఒక భయానక వాతావరణంగా, రణరంగంగా మారిపోయాయి.
ఇంట్లోకి చొరబడిన ఆ నాలుగు ఏనుగులు అక్కడితో ఆగకుండా తీవ్ర స్థాయిలో విధ్వంసం సృష్టించాయి. బైగా గిరిజన వర్గానికి చెందిన రెండు కుటుంబాల నివాసాలను తమ తొండాలతో, కాళ్లతో తొక్కి పూర్తిగా నేలమట్టం చేశాయి. ఇంటి గోడలు కూలిపోవడం, పైకప్పులు ధ్వంసం కావడంతో లోపల ఉన్న సామాన్లన్నీ తునాతునకలయ్యాయి. అంతేకాకుండా, మరుసటి రోజు పెళ్లి విందు భోజనం కోసం ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి సిద్ధం చేసుకున్న బియ్యం బస్తాల వాసన పసిగట్టిన ఏనుగులు వాటిపై దాడి చేశాయి. బస్తాలను చించి పడేసి, ఆ బియ్యాన్ని కడుపునిండా తినేయడమే కాకుండా, మిగిలిన ధాన్యాన్ని అంతా నేలపాలు చేసి చిందరవందరగా మార్చేశాయి. ఎన్నో ఆశలతో దాచుకున్న ఆహార పదార్థాలు, పెళ్లి సామాగ్రి కళ్లముందే నాశనం కావడంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
ఏనుగుల గుంపు గ్రామంలోనే తిష్ట వేయడంతో కేశ్‌మర్దా వాసులకు ఆ రాత్రంతా ఒక కాళరాత్రిలా గడిచింది. చీకట్లో ఎప్పుడు ఏ వైపు నుంచి గజరాజులు మళ్లీ దాడి చేస్తాయోనన్న తీవ్ర ఆందోళనతో గ్రామస్తులంతా ఇళ్లలోకి వెళ్లే ధైర్యం చేయలేక బిక్కుబిక్కుమంటూ గడిపారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటూ తెల్లవార్లు జాగారం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వాస్తవానికి, గడిచిన వారం రోజులుగా ఈ అటవీ సరిహద్దు ప్రాంతంలో ఈ ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో స్థానికుల్లో మొదటి నుంచీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. ఏనుగుల కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తూ, వాటిని తిరిగి దట్టమైన అడవిలోకి పంపించేందుకు ప్రత్యేక బృందాలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఈ ఊహించని ప్రకృతి విపత్తుతో ఆ గిరిజన కుటుంబాల పెళ్లి ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. తలదాచుకునే ఇల్లు కూలిపోయి, అతిథుల విందు కోసం తెచ్చిన సరుకులన్నీ నాశనం కావడంతో వారు ఇప్పుడు కట్టుబట్టలతో రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. రోజువారీ కూలీ చేసుకుంటూ రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద బైగా కుటుంబాలు కావడంతో, జరిగిన ఈ భారీ నష్టాన్ని తట్టుకోలేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానవతా దృక్పథంతో స్పందించాలని గ్రామస్తులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఆగిపోయిన పెళ్లి ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. అలాగే పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, భవిష్యత్తులో అటవీ జంతువులు గ్రామాల వైపు రాకుండా సోలార్ ఫెన్సింగ్ వంటి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
