రాజకీయాల్లో అనుభవమే అర్హత… వయసు పెరిగితేనే పెద్ద పదవులు వస్తాయనే పాత మాటలకు కాలం చెల్లుతోంది. ఇప్పుడు యువత తమ చదువు, ఆలోచనలు, వేగవంతమైన వ్యూహాలతో రాజకీయ రంగంలో కొత్త చరిత్ర రాస్తోంది. ఎన్నికల్లో గెలవడమే కాదు… కీలక బాధ్యతలు చేపడుతున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి ఆసక్తికర రాజకీయ కథే ఇప్పుడు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో వినిపిస్తోంది. కేవలం 24 ఏళ్ల వయసులో కార్పొరేటర్ నుంచి డిప్యూటీ మేయర్ పీఠం దాకా దూసుకెళ్లిన చావలి చర్పిత ప్రయాణం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఇదో ఆసక్తికర పరిణామం. నగర పాలనలో కీలకమైన మేయర్ పదవిని శ్రీశిల్ప చేపట్టగా, డిప్యూటీ మేయర్‌గా చావలి చర్పిత బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరు మహిళల చేతుల్లో నగర పాలనా పగ్గాలు ఉండటం ఒక విశేషమైతే… అందులోనూ 24 ఏళ్ల యువతి డిప్యూటీ మేయర్‌గా ఎదగడం మరో విశేషం. కార్పొరేటర్‌గా ఎన్నికైన కొద్ది రోజులకే ఆమెకు డిప్యూటీ మేయర్ వంటి కీలక పదవి దక్కడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. యువతకు, ముఖ్యంగా యువతులకు రాజకీయాల్లో అవకాశాలు పెరుగుతున్నాయనడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
ఇక చర్పిత రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే, నేటి తరం రాజకీయ ప్రచారం ఎలా మారుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. ఒంగోలు 27వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, సంప్రదాయ ప్రచారానికి ఆధునిక హంగును జోడించారు. ఒకవైపు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను నేరుగా పలకరించడం, చిరునవ్వుతో ఓటర్ల సమస్యలు వినడం… మరోవైపు ప్రచార వీడియోలు, రీల్స్ ద్వారా యువతకు చేరువ కావడం ఆమెకు పెద్ద ప్లస్‌గా మారింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఎన్నికల సమయంలోనే చర్పిత పేరు 27వ డివిజన్ దాటి ఒంగోలు అంతటా మారుమోగింది. చివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై విజయం సాధించి కార్పొరేటర్‌గా గెలిచారు…
మరోపక్క రాజకీయాల్లోకి రావడానికి చర్పితకు ఉన్న విద్యా, కుటుంబ నేపథ్యాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసిన ఆమెకు, చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజా సేవ, రాజకీయాల వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె కుటుంబానికి టీడీపీతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. తండ్రి మున్సిపల్ కాంట్రాక్టర్‌గా పనిచేయడం వల్ల పట్టణ సమస్యలు, పాలనా ప్రక్రియలపై అవగాహన ఏర్పడింది. తాత చావలి కృష్ణయ్య గతంలో కౌన్సిలర్‌గా పనిచేయగా, అమ్మమ్మ అనంతమ్మ అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యం ఆమెకు రాజకీయ ఓనమాలు నేర్పితే, ఆమె చదువు, యువతతో కనెక్ట్ అయ్యే శైలి ఆమెకు కొత్త బలాన్ని ఇచ్చాయి.”
యాంకర్: ఇక గెలిచిన తర్వాత కూడా ప్రజలను మర్చిపోకుండా, 27వ డివిజన్‌లో ప్రతి ఓటరును కలిసి కృతజ్ఞతలు చెప్పడం… ఈ విజయాన్ని ప్రజల విజయంగా పేర్కొనడం ఆమె రాజకీయ పరిణతిని చూపిస్తోంది. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టిన చర్పిత ముందున్న అసలైన సవాలు ఒక్కటే. రాజకీయాల్లోకి రావడం, గెలవడం ఒక ఎత్తయితే… క్షేత్రస్థాయి పాలనలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. యువత పాలనలోనూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగలరని చాటిచెప్పే అవకాశం ఇప్పుడు ఆమె ముందుంది.
