ఆంధ్రప్రదేశ్‌లో భారీ టెక్స్‌టైల్, అప్పారెల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేరళకు చెందిన ప్రముఖ కిటెక్స్ గార్మెంట్స్‌ను రాష్ట్రంలో సుమారు 2,000 ఎకరాల్లో భారీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ విషయాన్ని కిటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సాబు ఎం. జాకబ్ వెల్లడించారు. కిటెక్స్ గార్మెంట్స్ సంస్థ కేరళలోని కిజక్కంబలంలో నిర్వహిస్తున్న యూనిట్‌ను మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ప్రతిపాదిత టెక్స్‌టైల్ పార్క్‌పై ప్రాథమిక చర్చలు జరిగాయి.
2,000 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌టైల్, అప్పారెల్ పార్క్ సుమారు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. మొత్తం పెట్టుబడి అవసరం రూ.50 వేల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.పార్క్ రూపకల్పన, లేఅవుట్, అభివృద్ధి నిర్మాణాన్ని రూపొందించడంలో కిటెక్స్ కీలక పాత్ర పోషించనుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్‌కు ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కిటెక్స్ ఆసక్తి చూపుతోంది.

ప్రస్తుతం కిటెక్స్ గార్మెంట్స్‌కు తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్‌లో తయారీ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్ల పనితీరు, అక్కడ సంస్థకు లభించిన అనుభవం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిటెక్స్‌ను రాష్ట్రానికి ఆహ్వానించడానికి ఒక కారణంగా నిలిచింది.కిటెక్స్ ప్రతినిధులతో సమావేశం అనంతరం మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సాబు జాకబ్‌తో టెక్స్‌టైల్, అప్పారెల్ రంగం, తయారీ అవకాశాలు, ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక వ్యవస్థపై మంచి చర్చ జరిగిందని తెలిపారు.రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని కిటెక్స్‌ను ఆహ్వానించినట్లు లోకేశ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామిగా కలిసి పనిచేయాలని సంస్థను కోరినట్లు తెలిపారు.
పత్తి ఉత్పత్తిలో ముందున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రాసెసింగ్ నుంచి తయారీ, అప్పారెల్ ఉత్పత్తుల వరకు పూర్తి స్థాయి టెక్స్‌టైల్ విలువ గొలుసును అభివృద్ధి చేయగలిగితే.. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఇది కీలక ముందడుగుగా మారే అవకాశం ఉందన్నారు 2,000 ఎకరాల పార్క్ కార్యరూపం దాల్చితే పెట్టుబడులు, ఉపాధి, రైతుల ఆదాయ అవకాశాల పరంగా ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన ప్రయోజనం కలిగే అవకాశం ఉందని వివరించారు లోకేశ్.

ఏపీ దేశంలోని ప్రధాన పత్తి ఉత్పత్తి రాష్ట్రాల్లో కిటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సాబు జాకబ్ తెలిపారు. అయితే రాష్ట్రంలో పత్తిని ప్రాసెసింగ్ చేసి విలువను పెంచే మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పత్తిలో గణనీయమైన భాగం ఇతర రాష్ట్రాలకు తరలిపోయి అక్కడే ప్రాసెసింగ్, తయారీ ప్రక్రియలు జరుగుతున్నాయని వివరించారు.ఒకవేళ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటైతే.. ఆంధ్రప్రదేశ్‌లోనే పత్తిని ప్రాసెసింగ్ చేసి, దానికి అధిక విలువను జోడించే అవకాశం పెరుగుతుందని ఆయన వివరించారు. పత్తి నుంచి నూలు, వస్త్రాలు, అప్పారెల్ ఉత్పత్తుల వరకు మరింత విస్తృతమైన తయారీ కార్యకలాపాలు రాష్ట్రంలోనే జరిగే అవకాశం ఉంటుంది.దీంతో రైతులకు మాత్రమే కాకుండా పత్తి సేకరణ, ప్రాసెసింగ్, తయారీ, రవాణా, ఎగుమతులు వంటి టెక్స్‌టైల్ రంగంలోని వివిధ దశల్లో పనిచేసే వారికి కూడా కొత్త ఆర్థిక అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పత్తి పండించే రైతులకు తమ ఉత్పత్తికి స్థానికంగానే మరింత విలువ లభించే పరిస్థితి ఏర్పడుతుందని కిటెక్స్ వర్గాలు భావిస్తున్నాయి.
