సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ తాను నిజమైన హీరో అని నందమూరి బాలకృష్ణ మరోసారి నిరూపించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వ చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆయన తన సొంత ఇంటి స్థలంలో సగానికిపైగా భాగాన్ని ఎలాంటి పరిహారం ఆశించకుండా ప్రభుత్వానికి త్యాగం చేశారు. సాధారణంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ ఆస్తులు పోతాయనే నెపంతో అభివృద్ధి ప్రాజెక్టులను, ఫ్లైఓవర్ పనులను అడ్డుకుంటున్నారనే అపవాదు ఉన్న ఈ రోజుల్లో, బాలకృష్ణ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు అభినందనలు అందుకుంటోంది

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో రహదారుల విస్తరణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఈ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ చెందిన దాదాపు 862.77 చదరపు గజాల భారీ స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ప్రభుత్వానికి ఆ విలువైన స్థలాన్ని ఇచ్చినందుకు గాను నగదు రూపంలో ఎలాంటి నష్టపరిహారం తీసుకోవడానికి బాలకృష్ణ నిరాకరించారు. ప్రజా సంక్షేమం, నగర అభివృద్ధే ముఖ్యం భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ ఇల్లు కేవలం ఒక భవనం మాత్రమే కాదు, నందమూరి కుటుంబానికి, తెలుగు రాజకీయ చరిత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఇంటి స్థలం. ఈ నివాసాన్ని స్వయంగా దివంగత నందమూరి తారక రామారావు 1982లో నిర్మించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో, పార్టీకి సంబంధించిన ఎన్నో చారిత్రక, కీలకమైన సమావేశాలు, చర్చలు అన్నీ ఇదే ఇంట్లో జరిగాయి. ఎన్టీఆర్ ఆశీస్సులు, అంతులేని జ్ఞాపకాలు దాగి ఉన్న ఈ ఇంటిలో కొంత భాగం రోడ్డు విస్తరణలో కోల్పోవడం అభిమానులను కొద్దిగా భావోద్వేగానికి గురిచేస్తున్నప్పటికీ, దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన త్యాగం ముందు ఇది గొప్ప విషయంగా అందరూ కొనియాడుతున్నారు.

రోడ్డు విస్తరణ కారణంగా తన నివాసంలో సగానికిపైగా భాగం కోల్పోవడంతో, బాలకృష్ణ ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోనే మరొక నూతన భవనాన్ని అత్యంత సుందరంగా నిర్మించుకుంటున్నారు. పాత ఇంటికి సంబంధించిన జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటూనే, త్వరలోనే ఆయన తన కుటుంబంతో సహా ఈ కొత్త ఇంట్లోకి మారిపోనున్నారు. ప్రజా క్షేమం కోసం తన స్వగృహాన్నే త్యాగం చేసిన నందమూరి బాలకృష్ణ ఉదారత రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటోంది.స్వార్థం నిండిన నేటి రాజకీయ, సామాజిక వాతావరణంలో ప్రజా ప్రయోజనాల కోసం తన తండ్రి జ్ఞాపకాలను ముడిపడిన ఆస్తిలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి అప్పగించిన బాలకృష్ణ నిజంగానే ఆదర్శప్రాయులుగా నిలిచారు
