హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. తట్టి అన్నారం గ్రామ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ముళ్లపొదల్లో ఒక మహిళ మృతదేహం పడి ఉన్న ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. మార్నింగ్ టైంలో అటుగా వాకింగ్‌కి వెళ్లిన స్థానికులు, కొందరు మార్నింగ్ వాకర్స్ కొద్ది దూరంలో కుక్కలు గుంపుగా చేరి ఏదో పీక్కుతింటుండటాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి చూసేసరికి వారి వెన్నులో వణుకు పుట్టింది. కుక్కలు తింటున్నది ఏ జంతువునో కాదు.. ఒక మహిళ మృతదేహాన్ని అని గమనించి కంగుతిన్నారు. వెంటనే తేరుకుని స్థానిక నాగోల్ పోలీసులకు సమాచారం అందించారు.
ఇక సమాచారం అందుకున్న వెంటనే నాగోల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా.. అప్పటికే ఆ భయానక పరిస్థితి చూసేవారికీ గుండెల్ని పిండేసేలా ఉంది. మృతదేహానికి కాళ్లు, చేతులు పూర్తిగా కన్పించని దయనీయ స్థితిలో ఉంది. కుక్కలు వాటిని పీక్కుతిన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆనవాళ్ల ఆధారంగా మృతురాలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మానికేశ్వర్ నగర్‌కు చెందిన ‘మంగమ్మ’గా పోలీసులు గుర్తించారు. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సరిగ్గా గత నెల 28వ తేదీన ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఈమెపై మిస్సింగ్ ఫిర్యాదు నమోదై ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన మంగమ్మ.. ఇక్కడ ఇంత దారుణమైన స్థితిలో శవమై తేలడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు క్రైమ్ కోణంలో తీవ్రంగా దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం పక్కనే కొన్ని మద్యం బాటిల్స్ పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీన్ని బట్టి హత్యకు ముందు అక్కడ ఏదైనా పార్టీ జరిగిందా? లేక ఎవరైనా ఆమెను ఇక్కడికి రప్పించి మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. అంతేకాకుండా, మంగమ్మపై నిందితులు అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శరీరం ఛిద్రం కావడం, కాళ్లు చేతులు దెబ్బతిని ఉండటంతో పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే పూర్తి నిజాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు… ఓయూ ఏరియా నుంచి మంగమ్మ నాగోల్ ప్రాంతానికి ఎలా వచ్చింది? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక తెలిసినవారే ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి మోసం చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఓయూ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసు వివరాలను, నాగోల్ పోలీసులు సేకరిస్తున్న క్లూస్‌ను లింక్ చేస్తున్నారు. గత నెల 28 నుంచి ఆమె ఎెవరితో టచ్‌లో ఉంది? చివరిసారిగా ఆమె ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్లాయి? అనే కోణంలో కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అలాగే రూట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి నిందితులు ఎవరనే దానిపై గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నగరంలో ఇలాంటి దారుణ హత్యలు వరుసగా వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
