ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రాచలంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. కేవలం రూ.100 కోసం లాడ్జి సిబ్బంది ఓ యువకుడిని కొట్టి చంపారు. నిందితులు యువకుడు యాక్సిడెంట్ లో చనిపోయాడనుకునే విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భద్రాచలం పట్టణంలోని ప్రసిద్ధ రామాలయం ఏరియాలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న తెల్లం శరత్ అనే యువకుడి వద్దకు హైదరాబాద్ నుంచి అతని ఫ్రెండ్స్ వచ్చారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన స్నేహితులకు వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో శరత్ వారందరినీ తీసుకొని రామాలయం సమీపంలోని ‘శ్రీ సత్యసాయి లాడ్జింగ్’ వద్దకు వెళ్లాడు. రాత్రి సమయం కావడంతో అక్కడ రూమ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో యువకులందరూ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సరదాగా సాగాల్సిన ఆ రాత్రి, ఒక్కసారిగా రక్తపాతానికి దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు.
లాడ్జి రిసెప్షన్ వద్దకు వెళ్లిన యువకులు రూమ్ కావాలని అడగగా, నిర్వాహకులు అద్దె 600 రూపాయలు అవుతుందని చెప్పారు. అయితే శరత్, అతని మిత్రులు తాము కేవలం 500 రూపాయలు మాత్రమే ఇస్తామని బేరమాడారు. ఈ వంద రూపాయల డిఫరెన్స్ తో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగింది. దీనికి తోడు రూమ్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ కచ్చితంగా ఇవ్వాలని లాడ్జి సిబ్బంది పట్టుబట్టారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులకు, లాడ్జి మేనేజ్‌మెంట్‌కు మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. సహనం కోల్పోయిన లాడ్జి సిబ్బంది ఒక్కసారిగా శరత్‌పై విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా పిడిగుద్దులతో దాడి చేయడంతో శరత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో లాడ్జి నిర్వాహకుల్లో ఒక్కసారిగా భయం మొదలైంది. తాము చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు వారు ఒక పక్కా స్కెచ్ వేశారు. శరత్‌పై తాము దాడి చేయలేదని, అతనికి ఏదో యాక్సిడెంట్ జరిగిందని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించారు. ఏమీ తెలియనట్లు నటిస్తూ, హుటాహుటిన శరత్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. శరత్‌ను పరీక్షించిన డాక్టర్లు, అతను ఆసుపత్రికి తీసుకురాకముందే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో లాడ్జి సిబ్బంది వేసిన కవరింగ్ డ్రామా కాస్తా బెడిసికొట్టింది.
శరత్ ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కస్టమర్లతో మర్యాదగా ప్రవర్తించాల్సిన లాడ్జింగ్ యాజమాన్యం, క్షణికావేశంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం? కేవలం వంద రూపాయల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం మానవత్వానికే మాయని మచ్చ. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని లోతుగా విచారణ జరుపుతున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేలా నిందితులకు కఠిన శిక్ష పడాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
