దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం తీవ్ర కలకలం సృష్టించింది. రాత్రి 10:23 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లతో కూడిన ఎన్‌సీఆర్ పరిధిలో భూమి బలంగా కంపించింది. సుమారు 30 సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగడంతో పలు భవనాలు, అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు తీవ్ర భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది.. ఇక ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. దీని కేంద్రం ఖదూన్ లగా గ్వాలీకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. దీనికి తోడు ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ ప్రాంతంలో కూడా 4.4 తీవ్రతతో మరో ప్రకంపన నమోదైంది.
ఉత్తరాఖండ్‌లోని దాదాపు అన్ని జిల్లాలతో పాటు, పక్కనే ఉన్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించడంతో ఉత్తరాది ప్రజలు వణికిపోయారు. మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో సంభవించిన మరో భారీ భూకంప ప్రభావం కూడా ఉత్తర భారతదేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలపై పడినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఇన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అసలు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోనే ఎందుకు తరచూ ఇలా జరుగుతోంది? శాస్త్రీయంగా చెప్పాలంటే.. ఢిల్లీ ప్రాంతం భౌగోళికంగా భూకంపాలు సంభవించే అత్యంత అధిక ముప్పు ఉన్న ప్రాంతాల జాబితాలో ఉంది. సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ప్రకారం ఢిల్లీని అత్యంత సున్నితమైన ‘సీస్మిక్ జోన్-4’ పరిధిలో చేర్చారు. దీనికి ప్రధాన కారణం.. ఈ ప్రాంతం హిమాలయ పర్వత శ్రేణులకు సమీపంలో ఉండటమే! చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరంతరం భూఫలకాల కదలికలు జరుగుతుండటం వల్ల ఇక్కడ భూగర్భంలో టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. భూమి లోపలి పొరల్లో ఉండే ప్రధాన టెక్టోనిక్ ఫలకాలు నిరంతరం కదులుతూ ఒకదానితో ఒకటి ఢీకొంటూనే ఉంటాయి. ఇవి కలిసే ప్రదేశాలను ‘ఫాల్ట్ లైన్లు’ అంటారు. ఈ ఫలకాలు తీవ్రమైన ఒత్తిడికి గురై వంగిపోవడం లేదా అకస్మాత్తుగా విరిగిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో భూగర్భం నుంచి అపారమైన శక్తి తరంగాల రూపంలో పైకి దూసుకువస్తుంది. ఆ శక్తి భూ ఉపరితలాన్ని తాకినప్పుడు మనం ఈ భూకంప ప్రకంపనలను అనుభవిస్తాం.”
ఇక ఉత్తరాదిని కుదిపేసిన ఈ ఘటనకు ముందే, తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కూడా భూమి కంపించింది. అస్సాంలోని నాగావ్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు భూవిజ్ఞాన కేంద్రం వెల్లడించింది. ఒకే రోజున దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో భూమి కంపించడం ప్రజల్లో కాస్త ఆందోళన కలిగించింది.
