అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలోని ఒక నర్సరీలో గత నెల 29వ తేదీన మింగి రమేష్ అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆ యువకుడిని హత్య చేసి గంపా దుర్గాప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం మడికి గ్రామంలో రమేష్ అనే యువకుడి హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది..అయితే ఈ దారుణానికి ‘అక్రమ సంబంధమే కారణమనే కోణంలో పోలీసులు విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి.నిందితుడు గంపా దుర్గాప్రసాద్, అతని భార్య అనూష 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన రెండేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు, కుటుంబ కలహాలు తలెత్తాయి. భర్తతో విభేదాలు రావడంతో అనూష గత ఆరు నెలలుగా భర్తకు దూరంగా ఉంటూ.. స్థానికంగా ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. భార్య వేరుగా ఉంటున్నప్పటికీ, వారి మధ్య మనస్పర్థలు అలానే కొనసాగుతూ వచ్చాయి.”
ఇక ఈ క్రమంలోనే అనూషకు మృతుడు మింగి రమేష్‌తో పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. గత నెల 29న అర్ధరాత్రి సమయంలో అనూష ఇంటి నుంచి రమేష్ బయటకు వస్తుండటాన్ని ఆమె భర్త గంపా దుర్గాప్రసాద్ కంటపడ్డాడు. తన భార్య దగ్గరకు అర్ధరాత్రి సమయంలో వచ్చిన రమేష్‌ను చూసి దుర్గాప్రసాద్ రగిలిపోయాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చెలరేగింది. ఆగ్రహంతో ఊగిపోయిన దుర్గాప్రసాద్ తన వెంట తెచ్చుకున్న చాకుతో రమేష్ పై విచక్షణారహితంగా పొడిచాడు. ఆ తర్వాత ఊపిరి ఆడకుండా గొంతు నులిమి అత్యంత క్రూరంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించిన పోలీసులు నిందితుడిని గుర్తించి.. మడికి గ్రామంలోనే దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన చాకుతో పాటు సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అక్రమ సంబంధాలు, క్షణికావేశంలో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు ఎంతటి ఘోరాలకు దారితీస్తాయో ఈ ఘటనే మరోసారి నిరూపించింది. క్షణాల కోపం మనిషి జీవితాన్ని, భవిష్యత్తును ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఇదొక పెద్ద హెచ్చరిక.
