హైదరాబాద్ నగరంలో మరో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. రాత్రికి రాత్రే ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో ఆ ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాచిగూడలోని రద్దీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో చుట్టుపక్కల నివాసితులు ఊపిరి బిగబట్టుకుని గడిపారు. అసలు ఈ భారీ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఓ వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందా? ఫ్లాట్ ఓనర్లు పదే పదే మొరపెట్టుకున్నా అధికారులు, ఆ వ్యక్తి ఎందుకు పట్టించుకోలేదు?
కాచిగూడ చపల్ బజార్‌లోని రహ్మత్ గార్డెన్ అపార్ట్‌మెంట్ సమీపంలో రాత్రి సమయంలో ఉన్నట్టుండి అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే మంటలు భారీగా ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అపార్ట్‌మెంట్ నివాసితులు, చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అసలు మంటలు ఎక్కడి నుంచి వచ్చాయా అని పరిశీలించగా… అపార్ట్‌మెంట్ పక్కనే పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాల్లో ఈ నిప్పు రాజుకున్నట్లు తేలింది.”
“ఈ ప్రమాదానికి అసలు కారణం కొన్నేళ్ల నాటి నిర్లక్ష్యమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు నాలుగు ఐదేళ్ల క్రితం ఇక్కడ ఒక అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. అయితే ఆ కూల్చివేత తర్వాత మిగిలిపోయిన స్క్రాప్, నిర్మాణ సామగ్రిని ఇప్పటివరకు అక్కడి నుంచి తొలగించలేదు. ఈ సామాగ్రి గులాం దస్తగిర్ అనే వ్యక్తికి చెందినదిగా చెబుతున్నారు. ఆ వ్యర్థాలను వెంటనే ఖాళీ చేయించాలని అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ఓనర్లు, స్థానికులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా, ఆయన తీవ్ర నిర్లక్ష్యం వహించి పట్టించుకోలేదని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.”
అక్కడ పడి ఉన్న వ్యర్థాల్లో అత్యంత ప్రమాదకరమైన మెటీరియల్స్ ఉన్నాయి. కెమికల్స్ ఉన్న పెయింట్ డబ్బాలు, స్టీల్ జాలీలు, భారీగా థర్మాకోల్ షీట్లు అక్కడే పడేశారు. థర్మాకోల్ అనేది అత్యంత వేగంగా మండే గుణం ఉన్న పదార్థం కావడం వల్ల చిన్న నిప్పురవ్వ పడగానే మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదం కారణంగా అపార్ట్‌మెంట్‌లోని నివాసితుల ప్రాణాలకు, చుట్టుపక్కల ఆస్తులకు తీవ్ర ముప్పు వాటిల్లిందని, కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు మండిపడుతున్నారు.”
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ ఇంజన్లు సమయానికి రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని, లేకపోతే అపార్ట్‌మెంట్‌కు మంటలు వ్యాపించి భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి ప్రమాదకర నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
