దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ ఏకంగా రూ.10,000 కోట్ల SME గ్రోత్ ఫండ్‌కు ఆమోదం తెలిపింది. అదేవిధంగా రవాణా రంగాన్ని సమూలంగా మార్చేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధిని వేగవంతం చేయడానికి, వాటికి ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల నిధిని కేటాయించింది. చిన్న వ్యాపారాలుగా ఉన్న సంస్థలు ఉన్నత స్థాయికి ఎదగడానికి, గ్లోబల్ మార్కెట్‌లో ఇతర దేశాల కంపెనీలతో దీటుగా పోటీ పడేందుకు ఈ ఫండ్ ఎంతగానో దోహదపడుతుంది. తాజా నిధులలో ఎక్కువ భాగం చిన్న, మధ్యతరహా తయారీ రంగాలకు, అలాగే ఇతర పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు కేటాయించనున్నారు. కేవలం స్వల్పకాలిక రుణాలకే పరిమితం కాకుండా, ఈక్విటీ రూపంలో మూలధన సహాయం అందించడం ద్వారా చిన్న వ్యాపారాలపై ఉన్న రుణ భారాన్ని గణనీయంగా తగ్గించనున్నారు.
దేశంలో రవాణా, లాజిస్టిక్ రంగాల సమగ్ర అభివృద్ధి, పరిశోధన అలాగే వివిధ రవాణా మార్గాల అనుసంధానానికి నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు కేంద్రం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ అథారిటీ ద్వారా రైల్వేలు, రోడ్లు, పోర్టులు, విమానయాన రంగాలు మరింత మెరుగైన పద్ధతిలో అనుసంధానం కానున్నాయి. దేశవ్యాప్తంగా చేపడుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రణాళిక, వాటి అమలును పర్యవేక్షించడంలో ఈ అథారిటీ అత్యంత కీలక పాత్ర పోషించనుంది.
సాధారణంగా చిన్న వ్యాపారాలు అంటే బ్యాంకుల చుట్టూ తిరిగి, గ్యారెంటీలు పెట్టి, భారీ వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాలి. కానీ ఈ నిధి వల్ల.. అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి! అంటే ప్రభుత్వం మీ వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల నెలనెలా ఈఎంఐలు కట్టాలనే టెన్షన్ ఉండదు. ఎలాంటి శ్యూరిటీ చూపించాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు.
