ప్రేమోన్మాదం మరోసారి పడగవిప్పింది. ప్రేమించిన యువతి ప్రాణాలను తీయడమే లక్ష్యంగా ఓ ప్రేమోన్మాది చేసిన ఘాతుకం విజయవాడలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియురాలిపై పెంచుకున్న గుడ్డి అనుమానం, చివరకు ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరిని చావుబతుకుల మధ్యకు నెట్టింది. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది.
కొంతకాలంగా మహాలక్ష్మి, చిన్నారావు అనే యువతీయువకులు ప్రేమలో ఉన్నారు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో, ప్రియురాలు మహాలక్ష్మిపై చిన్నారావుకు విపరీతమైన అనుమానం పెరిగింది. ఆ అనుమానమే అతని తలకెక్కి క్షణికావేశంలో ఒక ఉన్మాదిలా మార్చేసింది. ఎలాగైనా ఆమెను అంతమొందించాలనే క్రూరమైన నిర్ణయానికి వచ్చాడు. సమయం చూసి మహాలక్ష్మిపై చిన్నారావు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. చేతిలో ఉన్న కొడవలితో ఆమె మెడపై అత్యంత దారుణంగా కోశాడు. రక్తం మడుగులో ఆ యువతి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా, ఆ కిరాతకుడు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.
అయితే, తాను చేసిన ఘాతుకానికి భయపడ్డాడో ఏమో కానీ, వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పక్కనే ఉన్న బిల్డింగ్ పైకి ఎక్కి, అక్కడ నుంచి కిందకు దూకేసి అక్కడికక్కడే ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం బాధితురాలు మహాలక్ష్మి తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మహాలక్ష్మి ప్రాణాల కోసం పోరాడుతోంది. అనుమానంతో మొదలైన ఈ ప్రేమ కథ, చివరకు ఒకరి ఆత్మహత్యకు, మరొకరి ప్రాణాంతక స్థితికి దారితీయడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
