మీ పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు జమ అయిందో తెలుసుకోవాలంటే ఇంతకుముందు వెబ్సైట్ ఓపెన్ చేయడం, పాస్వర్డ్ గుర్తుంచుకోవడం, సర్వర్ బిజీగా ఉంటే గంటల తరబడి వేచి చూడటం లాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు కదూ! కానీ ఇకపై ఆ తలనొప్పి అస్సలు ఉండదు. ఎందుకంటే మీరు రోజూ వాడే వాట్సాప్ నుంచే కేవలం ఒక్క మెసేజ్ పంపించి మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే అద్భుతమైన సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఏ నంబర్‌కు మెసేజ్ చేయాలి? ఏమేం వివరాలు చూడొచ్చు?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అంటే ఈపీఎఫ్ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సరికొత్త వాట్సాప్ సేవలను అధికారికంగా ప్రారంభించారు. కోట్లాది మంది పీఎఫ్ చందాదారులకు సేవలను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ ముందడుగు వేశారు. దీనివల్ల చందాదారులు ఇకపై ప్రత్యేకంగా ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే తమ ఖాతా వివరాలను సులభంగా పొందవచ్చు.
ఈ కొత్త వాట్సాప్ సేవ ద్వారా చందాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు, తమ ఖాతాలో జరిగిన చివరి ఐదు లావాదేవీలు, పూర్తి పాస్‌బుక్ వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి +918796441800 అనే అధికారిక నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపించడమే. వెంటనే ఆటోమేటెడ్ రిప్లై ద్వారా మీకు కావలసిన ఆప్షన్లు స్క్రీన్ మీద కనిపిస్తాయి, వాటిని ఎంచుకుని మీ వివరాలు చూసుకోవచ్చు.
డిజిటల్ సేవలు ఎంత సులభతరం అవుతున్నాయో, అదే స్థాయిలో సైబర్ మోసగాళ్ల బారిన పడే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అందుకే సైబర్ భద్రత దృష్ట్యా ఈపీఎఫ్ఓ చందాదారులకు ఒక కీలక సూచన చేసింది. మీ ఖాతాకు సంబంధించిన ఓటీపీ, యూఏఎన్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేసింది. కేవలం ఈపీఎఫ్ఓ ప్రకటించిన అధికారిక వాట్సాప్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించాలని, అనుమానాస్పద లింకులు లేదా నకిలీ నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఉద్యోగికి, కార్మికుడికి ఈ వాట్సాప్ సేవలు ఎంతో సమయాన్ని ఆదా చేస్తాయి. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారు కూడా వెబ్సైట్ లాగిన్ సమస్యలు లేకుండా చాలా సులువుగా తమ కష్టార్జితం వివరాలు తెలుసుకోవచ్చు.
