కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ఆపద జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వం అండగా నిలబడితే ఎంత బాగుంటుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటికిపైగా కుటుంబాలకు భరోసా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని రేపటి నుంచి అట్టహాసంగా ప్రారంభిస్తోంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు..? ఎవరి పేరు నమోదు చేయాలి? వయసు పరిమితి ఎంత? అసలు రేషన్ కార్డు లేని వారు కూడా దీనికి అర్హులేనా? అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటి..?
ఈ పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లకు, అలాగే హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మహానగర పాలక సంస్థల కమిషనర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందిరమ్మ జీవిత బీమా కింద ప్రతి కుటుంబంలో సంపాదించే ఒక వ్యక్తి పేరిట మాత్రమే బీమా నమోదు చేస్తారు. ఒకవేళ కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదిస్తున్నా, వారిలో ఎవరిని నమోదు చేయించాలనేది కుటుంబ సభ్యులే స్వయంగా నిర్ణయించుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆ వ్యక్తి మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ఇందుకోసం 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు, అంటే 1967 నవంబరు 19 నుంచి 2008 నవంబరు 18 మధ్య జన్మించిన వారు అర్హులు. జనన ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డులోని తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారు.
ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియను ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల అంటే డిసెంబరు 18వ తేదీ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇక్కడ ఒక ముఖ్యమైన వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. అదేంటంటే, నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆ బీమా కాలంలో సదరు వ్యక్తి గరిష్ఠ వయోపరిమితి అయిన 59 ఏళ్లను దాటినప్పటికీ, కనీసం ఒక సంవత్సరం పాటు పూర్తి బీమా కవరేజీని పొందుతారని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనివల్ల 59 ఏళ్లకు దగ్గరలో ఉన్న వారికి కూడా ఎలాంటి నష్టం కలగకుండా పూర్తి భద్రత లభించనుంది.
అర్హత కలిగిన ప్రతి కుటుంబం సులభంగా ఈ పథకంలో చేరేలా గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక సహాయక నమోదు శిబిరాలను నిర్వహించనున్నారు. శిబిరాల నిర్వహణకు రెండు రోజుల ముందు నుంచే దండోరా వేయించడంతో పాటు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో వార్డు అధికారి ఈ శిబిరాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న ఆహారభద్రత కార్డుల డేటా ఆధారంగా నమోదు జరుగుతుంది. ఒకవేళ ఆ డేటాలో పేర్లు లేకపోయినా, అసలు రేషన్ కార్డు లేకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు; వారి కోసం విడిగా మరో దరఖాస్తు ఫారం ఇచ్చి, వారికి ఒక ప్రత్యేక కోడ్ కేటాయించి బీమాలో చేర్చుకుంటారు.
దరఖాస్తు సమయంలో బీమా పొందే సభ్యుని వివరాలతో పాటు కుటుంబ సభ్యులు, నామినీ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే, వారికి ఆ రూ.5 లక్షల క్లెయిమ్ వాటాలు ఏ విధంగా వర్తిస్తాయో నమోదు సమయంలోనే అధికారులు స్పష్టంగా వివరిస్తారు. అంతేకాకుండా ఇతర జిల్లాలకు చెందిన రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు కూడా తాము నివసిస్తున్న సమీప శిబిరంలో నమోదు చేసుకోవచ్చు. ప్రజల సందేహాలను తీర్చడానికి రాష్ట్ర స్థాయిలో హెల్ప్ డెస్క్, జిల్లాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ డిసెంబరు 18 లోపు తప్పకుండా నమోదు చేసుకోండి.
