ఏపీలో వాతావరణం మళ్లీ మారబోతుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పలకరించనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురిసే వీలుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతాల్లో నిన్నటి వరకు కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని చెప్పారు. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
శనివారం కోస్తాంధ్ర, యానాం పరిధిలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు వచ్చే సూచనలున్నాయి. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఆది, సోమవారాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ని, ఆదివారాల్లో రాయలసీమ వ్యాప్తంగా ఒకటి లేదా రెండు ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సోమవారం వాతావరణంలో మార్పులు మరింత పెరిగి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. బలమైన గాలులు కొనసాగుతాయి. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు, వ్యవసాయ పనుల్లో ఉండే వారు, లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
