కొన్నిసార్లు కాలం ముందుకు సాగిపోతుంది.. కానీ, కొందరు వ్యక్తులు మాత్రం తమ సృజనాత్మకతతో కాలాన్ని శాసించి చిరకాలం నిలిచిపోతారు. భారతీయ సినిమా ఉన్నంతకాలం.. ప్రయోగానికి, సాహసానికి అర్థం చెప్పిన ఆ దిగ్గజం పేరు చరిత్ర పుటల్లో అజరామరంగా నిలిచిపోతుంది. అతనే సింగీతం శ్రీనివాసరావు. ప్రయోగాల మాంత్రికుడు, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు! సింగీతం మృతి…యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది
1931 సెప్టెంబర్ 31న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు సింగీతం శ్రీనివాసరావు. చిన్నప్పటి నుంచే ఆయనకు కళలపై అమితమైన ఆసక్తి. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో హరీచంద్రనాథ్ ఛటోపాధ్యాయ ఆధ్వర్యంలో నాటక రంగంలోకి అడుగుపెట్టారు. డిగ్రీ పూర్తయిన తర్వాత మొదట కొద్దికాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కానీ, మనసులో ఉన్న సినిమా పిచ్చి ఆయనను ఊరుకోనివ్వలేదు. కేవలం దర్శకత్వమే కాదు.. ఒక సంగీత దర్శకుడిగా, నటుడిగా కూడా తన ట్యాలెంట్ ను నిరూపించకున్నారు. ఎవరికీ సాధ్యం కాని ప్రయోగాలు చేయడమే ఆయన నైజం. అందుకే ఆయనకు ‘ప్రయోగాల మాంత్రికుడు’ అనే పేరు సార్థకమైంది..

ఇక సింగీతం తెరకెక్కించిన సినిమాలన్నీ ఒకెత్తు.. ఆయన చేసిన ప్రయోగాలు ఇంకొకెత్తు! తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 60కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. పుష్పక విమానం.. మాటలు లేని సినిమా తీయవచ్చని నిరూపించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. కమలహాసన్ హీరోగా నటించిన ఈ మూకీ చిత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక ఆయన చరిత్రలో మరో మైలురాయి.. ఆదిత్య 369. తెలుగు తెరపై మొట్టమొదటి టైమ్ మెషీన్ కథ. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వైభవాన్ని, భవిష్యత్తును కళ్ళకు కట్టినట్లు చూపించి టాలీవుడ్ చరిత్రను మార్చేశారు.
ఆ తర్వాత భైరవద్వీపం.. జానపద సినిమా అంటే కేవలం కత్తుల యుద్ధాలే కాదు, అద్భుతమైన ఫాంటసీ అని నిరూపించిన మాస్టర్ పీస్ ఇది…ఇక విచిత్ర సోదరులు… పొట్టి పాత్రలో కమల్ హాసన్ నటన ఒకెత్తు అయితే, దానికి సింగీతం అందించిన టెక్నికల్ మ్యాజిక్ ఇంకోఎత్తూ. ఇక వీటితో పాటు మయూరి, మైఖైల్ మదన కామరాజు, ముంబై ఎక్స్ ప్రెస్, ఘటోత్కచ, సొమ్మొకడిది సోకొకడిది, పంతులమ్మ, అమావాస్య చంద్రుడు, అలాగే చివరి రోజుల్లో తీసిన వెల్ కమ్ ఒబామా వంటి విభిన్న చిత్రాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయిని విశ్వవ్యాప్తం చేశారు సింగీతం శ్రీనివాసరావు.
వయసు కేవలం నెంబర్ మాత్రమే అని నిరూపించారు సింగీతం. ఏకంగా 94 ఏళ్ల వయసులో కూడా ‘సింగ్ గీతం’ అనే సినిమాకు దర్శకత్వం వహించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చివరి శ్వాస వరకు సినిమానే ఊపిరిగా బతికారు ఆయన. ఆయన చేసిన ఈ అద్భుత సేవలకు గాను రెండు జాతీయ పురస్కారాలు, 5 నంది అవార్డులు. మూడు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌తో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు . 2011లో, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డులన్ని ఆయనను వెతుక్కుంటూ వచ్చాయే తప్ప, ఆయన ఎప్పుడూ గుర్తింపు కోసం పాకులాడలేదు. సింగీతం’ అంటే ఒక దర్శకుడు మాత్రమే కాదు.. తెలుగు సినిమా గర్వించదగిన ఒక అద్భుత ప్రయోగశాల.. ఆయన భౌతిక రూపం మన మధ్య లేకపోయినా.. ఆయన సృష్టించిన అద్భుత దృశ్యాలు, నవ్వించిన వెన్నెల తెరలు, ఆలోచింపజేసిన కథలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.
