గనతలంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ ఫ్లైట్‌లో ఒక్కసారిగా అలర్ట్ బెల్స్ మోగితే? గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ల్యాండింగ్ సంకేతాలు వస్తే? సరిగ్గా అలాంటి భయాందోళన కలిగించే సంఘటనే లండన్ నుంచి చికాగో వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో చోటుచేసుకుంది. సోమవారం బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీఏ295 విమానంలో అకస్మాత్తుగా మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ ఏర్పడింది. అసలు అట్లాంటిక్ మీదుగా వెళ్తున్న ఆ ఫ్లైట్‌లో ఏం జరిగింది? పైలట్లు ఎందుకు ఎమర్జెన్సీ కోడ్ సెట్ చేశారు?
బోయింగ్ 777-200ఈఆర్ విమానం సోమవారం ఉదయం సుమారు 11:50 నిమిషాలకు లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 5 నుంచి అమెరికాలోని చికాగో ఓ’హేర్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. దాదాపు 8 గంటల 40 నిమిషాల సుదీర్ఘ ప్రయాణంతో ఇది చికాగో చేరాల్సి ఉంది. అంతా సవ్యంగానే సాగుతోంది అనుకున్న సమయంలో, ఐర్లాండ్ ఎయిర్‌స్పేస్‌లో విమానం ప్రయాణిస్తుండగా ఫ్లైట్-ట్రాకింగ్ డేటాలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 37 వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కిందకు దిగడం ప్రారంభించింది.”
37 వేల అడుగుల గగనతలం నుంచి సుమారు 28 వేల అడుగుల మేర అకస్మాత్తుగా పడిపోయి, దాదాపు 9 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. అదే టైమ్‌లో పైలట్లు వెంటనే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ట్రాన్స్‌పాండర్ కోడ్ 7700ను సెట్ చేశారు. ఈ కోడ్ 7700 అనేది గగనతలంలో సాధారణ అత్యవసర పరిస్థితిని సూచించే గ్లోబల్ అలర్ట్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ రాడార్‌పై ఈ కోడ్ కనిపిస్తే, సదరు విమానం తీవ్రమైన సమస్యలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ సిబ్బంది అప్రమత్తమై విమానంతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు.
ఈ తీవ్ర పరిణామంతో విమాన సిబ్బంది చికాగో ప్రయాణాన్ని వెంటనే రద్దు చేసుకున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం వైపు వెళ్లాల్సిన విమానాన్ని ఐర్లాండ్ సమీపం నుంచే యు-టర్న్ తీసుకుని తిరిగి లండన్ హీత్రూ వైపు మళ్లించారు. వేల అడుగుల ఎత్తులో విమానం అంత వేగంగా కిందకు దిగడం, ఎమర్జెన్సీ కోడ్ సెట్ చేయడం విమానంలో ఉన్న ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అయితే లండన్‌కు సురక్షితంగా తిరిగొచ్చే క్రమంలో పైలట్లు విమానాన్ని తమ కంట్రోల్‌లోనే ఉంచగలిగారు.
అయితే విమానంలో ఈ ఎమర్జెన్సీ రావడానికి అసలు రీజన్ ఏంటనేది ఇంకా సస్పెంస్‌గానే ఉంది. ఇది టెక్నికల్ స్నాగ్ వల్ల జరిగిందా? లేక ప్రయాణికుల్లో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? లేదా క్లైమేట్ ప్రాబ్లమ్ కారణమా? అనేది స్పష్టం కాలేదు. దీనిపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ నుంచి ఆఫీషియల్ స్టేట్‌మెంట్ వెలువడాల్సి ఉంది.
