సంతోషంగా బర్త్‌డే వేడుకలు జరుపుకోవాల్సిన రోజున ఒక కుటుంబంలో ఊహించని తీవ్ర విషాదం నిండిపోయింది. కూకట్‌పల్లి పీవీఆర్ మాల్‌లో సినిమా చూసి, ఎంతో ఉత్సాహంగా ట్యాంక్‌బండ్‌పై కేక్ కట్ చేయడానికి వెళ్లిన కుటుంబానికి అతివేగంగా వచ్చిన లారీ రూపంలో ఘోర మృత్యువు ఎదురైంది. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆరేళ్ల పసిపాపతో పాటు కుటుంబ పెద్ద దిక్కుగా ఉన్న మరొక బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఆనందంతో కేరింతలు కొట్టాల్సిన చోట తల్లిదండ్రుల కన్నీళ్లు, ఆర్తనాదాలు మాత్రమే మిగిలాయి.
సికింద్రాబాద్ సమీపంలోని ఓల్డ్ అల్వాల్ జొన్నబండ ప్రాంతానికి చెందిన కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ ఇంట్లోని ఆరేళ్ల చిన్నారి సరాక్షి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ప్రత్యేకంగా వేడుక ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ముందుగా కూకట్‌పల్లిలో ఉన్న పీవీఆర్ మాల్‌కు వెళ్లి అందరూ సరదాగా సినిమా చూశారు. సినిమా ముగిసిన తర్వాత, రాత్రి వేళ ట్యాంక్‌బండ్ వాతావరణంలో చిన్నారి చేత బర్త్‌డే కేక్ కట్ చేయించాలని నిర్ణయించుకున్నారు. 41 ఏళ్ల బంధువు విశ్వనాథ్ అలియాస్ విశ్వంత్‌తో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి వాహనంలో ట్యాంక్‌బండ్ వైపు బయలుదేరారు.

ట్యాంక్‌బండ్ చేరుకున్న తర్వాత, అక్కడ ఉన్న మగ్గం మోయుద్దీన్ విగ్రహం సమీపంలో తమ కారును పార్క్ చేశారు. అనంతరం కేక్ కటింగ్ కోసం హుస్సేన్‌సాగర్ వైపు ఉన్న కట్ట మీదకు వెళ్లేందుకు రోడ్డు దాటడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో సికింద్రాబాద్ వైపు నుంచి స్పీడ్‌తో దూసుకొచ్చిన ఒక లారీ రోడ్డు దాటుతున్న వారిని బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు వారంతా రోడ్డుపై ఎగిరిపడ్డారు. మరుక్షణంలోనే ఆ ప్రదేశమంతా రక్తం మడుగుగా మారింది.
లారీ ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆరేళ్ల చిన్నారి సరాక్షి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్లముందే పాప రక్తం మడుగులో పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. ఇక తీవ్రంగా గాయపడిన బంధువు విశ్వనాథ్‌ను వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ అత్య అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి విశ్వనాథ్ కూడా మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో ఓల్డ్ అల్వాల్ జొన్నబండలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. ప్రమాదానికి కారణమైన లారీపై, డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరిస్తున్నారు. అర్థరాత్రి వేళల్లో మితిమీరిన వేగంతో వెళ్లే భారీ వాహనాల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని నగర వాసులు వాపోతున్నారు.
