ఫ్లైదుబాయ్ విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ జరిపిన ప్రాణాంతక దాడి కేసులో.. అంతర్జాతీయ నిఘా వర్గాల విచారణలో వెన్నులో వణుకు పుట్టించే సంచలన నిజాలు బయటపడ్డాయి! ఇది కేవలం ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన గొడవ కాదని.. దీని వెనుక ఒక భయంకరమైన గ్లోబల్ టెర్రర్ ప్లాన్ ఉన్నట్లు అధికారులు అనుమానం పడుతున్నారు. గాల్లో ఉన్న 170 మంది ప్రయాణికులను మాత్రమే కాదు.. ఇజ్రాయెల్ గుండెల్లో ఆకాశ మార్గంలో చావు దెబ్బ కొట్టాలనేది ఆ సైకో కో-పైలట్ ప్లాన్‌గా తెలుస్తుంది.
అవును.. అమెరికాలో ట్విన్ టవర్స్‌ను కూల్చేసిన 9/11 ఉగ్రదాడుల తరహాలోనే.. ఇజ్రాయెల్ మట్టిపై మరో మహా వినాశనానికి కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ స్కెచ్ వేశాడని దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది! దుబాయ్ నుంచి బయలుదేరిన విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ గగనతలంలోకి తీసుకెళ్లడమే కో-పైలట్ మొదటి లక్ష్యంగా గుర్తించారు అధికారులు. అక్కడ ఆకాశాన్ని తాకేలా ఉండే ఒక భారీ ఎత్తైన భవనాన్ని ఈ విమానంతో అత్యంత వేగంగా ఢీకొట్టాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఫ్లైట్‌ను తన కంట్రోల్‌కి తెచ్చుకోవడానికి కో-పైలట్ ప్రయత్నించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.

ఒకవేళ బిల్డింగ్‌ను ఢీకొట్టడం సాధ్యం కాకపోతే.. ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన బెన్‌గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంపైకి డైవ్ చేసి, ఎయిర్‌పోర్టును పూర్తిగా బాంబు లేకుండానే భారీ పేలుడుతో ధ్వంసం చేయాలని భావించాడు.అంతేకాదు.. ఈ దారుణానికి ఒడిగట్టడానికి ముందే కో-పైలట్ హమ్మామీ ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి! జూన్ నెలలో అక్కడికి వెళ్ళినప్పుడు పూర్తిగా దాడికి సంబంధించిన రూట్ మ్యాప్, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడానికే సమయం వెచ్చించాడని విచారణలో తేలింది.నిజానికి జులైలోనే ఈ విమానాన్ని కూల్చేయాలని చూసినా.. ఆ సమయంలో విమాన సిబ్బందిలో తన ప్రాణ స్నేహితుడు ఉండటంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గాడని దర్యాప్తులో తేలడం ఇప్పుడు సంచలనంగా మారింది!
కానీ.. ఈ రాక్షస ప్లాన్ మొత్తాన్ని ప్రధాన పైలట్ స్మిత్ మచ్చర్ తన ప్రాణాలకు తెగించి తిప్పికొట్టాడు. గొడ్డలితో దాడి చేసినా లొంగకుండా.. చావుతో పోరాడి కాక్‌పిట్ తలుపులు తెరవడంతో ఉగ్ర కో-పైలట్ వ్యూహం అట్టర్ ప్లాప్ అయింది! మొదటి ప్లాన్ విఫలం కావడంతోనే విమానాన్ని ఎడారిలో కూల్చేయడానికి ఇంజిన్లు ఆపేశాడని, ఆ సమయంలోనే విమానం 16 వేల అడుగుల కిందికి పడిపోయిందని దర్యాప్తు అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఈ భయంకరమైన కుట్ర బయటపడటంతో.. విమాన సిబ్బందిని సైతం అదుపులోకి తీసుకుని విచారించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. లోతుగా దర్యాప్తు జరిపితే మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
