ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో వ్యవసాయ రంగ బలోపేతానికి, ఉద్యోగుల సామాజిక భద్రతకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ సమావేశంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. దాదాపు రూ. 2.79 లక్ష కోట్ల భారీ ప్యాకేజీతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాబోయే సీజన్‌కు సంబంధించి ఆరు ప్రధాన రబీ పంటల కనీస మద్దతు ధరలను (MSP) పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.గోధుమలు, ఆవాలు వంటి పంటలపై రైతులకు పెట్టుబడి ఖర్చు కంటే అత్యధికంగా దాదాపు 100 శాతానికి పైగా లాభసాటి రాబడి దక్కేలా ధరలను సవరించారు.శనగలు, మసూర్ వంటి మిగిలిన రబీ పంటలకు కూడా మద్దతు ధరలను భారీగా పెంచారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 90,962 కోట్ల అదనపు భారం పడనుండగా, దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
మధ్యతరగతి, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఊరటనిస్తూ సామాజిక భద్రతను మరింత విస్తృతం చేశారు. EPFO పరిధిలోకి వచ్చేందుకు ప్రస్తుతమున్న కనీస నెలవారీ వేతన పరిమితిని రూ. 15,000 నుండి రూ. 25,000లకు పెంచుతూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత పదేళ్లుగా మారకుండా ఉన్న ఈ పరిమితిని పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా అదనంగా మరో 51 లక్షల మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు విధిగా PF పరిధిలోకి వస్తారు. తద్వారా వారి పదవీ విరమణ కాలానికి పటిష్టమైన ఆర్థిక భద్రత లభిస్తుంది.మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రవాణా రంగానికి కేంద్రం భారీ నిధులను కేటాయించింది.
