కళశాలల్లో ర్యాగింగ్ భూతం మరోసారి పంజా విసిరింది! భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రఖ్యాత విద్యాసంస్థలో, ఎన్నో ఆశలతో కాలేజీకి వెళ్తున్న ఒక అమాయక విద్యార్థిపై సీనియర్లు రాక్షసంగా దాడి చేశారు. ర్యాగింగ్ పేరుతో జరిగిన ఈ అగమ్యగోచర సంఘటన ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం, సీనియర్ల అరాచకానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది…
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్‌లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ. ఈ కాలేజీలో ఈఈఈ సెకండ్ ఇయర్ చదువుతున్న రుత్విక్ అనే విద్యార్థిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. కేవలం జూనియర్ అనే అహంకారంతో, ఇష్టానుసారంగా వేధింపులకు గురిచేశారు. ఈ వేధింపులు కేవలం మాటలతో ఆగకుండా, చివరికి రుత్విక్‌పై భౌతిక దాడి చేసే స్థాయికి వెళ్లాయి. సీనియర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన రుత్విక్‌ను తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రుత్విక్ చికిత్స పొందుతున్నాడు.
మరోపక్క ఈ దారుణ ఘటనపై తోటి విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపల్ విశ్వనాధ్ రాజ్‌కు వెంటనే ఫిర్యాదు చేశారు. సీనియర్లపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. కానీ, బాధ్యతాయుతమైన పదవిలో ఉండాల్సిన ప్రిన్సిపల్ మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. విద్యార్థుల ఫిర్యాదును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వస్తున్నాయి..మరోపక్క ప్రిన్సిపల్ స్పందించకపోవడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. న్యాయం జరిగే వరకు ఊరుకోమంటూ విద్యార్థులంతా ఒక్కటయ్యారు. బాధితుడు రుత్విక్ తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ముందు ఆందోళనకు దిగారు.. సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజీ ఎదురుగా ఉన్న నేషనల్ హైవేపై విద్యార్థులు ధర్నా చేపట్టడం స్థానింకగా గందరగోళ వాతావరణం నెలకొంది.’ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లను వెంటనే సస్పెండ్ చేయాలి, వారికి అండగా ఉంటున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక ఈ ఆందోళన కారణంగా జోగిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి, శాంతింపజేసే ప్రయత్నం చేశారు.. అయితే, సీనియర్లపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు.”
