తెలంగాణలో మద్యం ప్రియులు బ్యాడ్ న్యూస్. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది. ప్రభుత్వం నూతనంగా విధించతలపెట్టిన పన్నుల భారానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన తమ వ్యాపారాలను ప్రభుత్వం తీసుకుంటున్న పన్నుల నిర్ణయాలు మరింత దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రతీ బార్‌పై వార్షికంగా 8 శాతం నుంచి 20 శాతం వరకు ప్రివిలేజ్ సెస్ విధించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే తమ వ్యాపారాల కోసం ఏటా రూ. 33 లక్షల నుంచి రూ. 56 లక్షల వరకు భారీ మొత్తంలో లైసెన్స్ ఫీజులను ప్రభుత్వానికి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని బార్ అసోసియేషన్ తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రివిలేజ్ సెస్ అమల్లోకి వస్తే, ప్రతీ బార్‌పై ఏడాదికి అదనంగా మరో రూ. 30 లక్షల ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు తమ వ్యాపారాలు ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నాయని నిర్వాహకులు వాపోతున్నారు. వైన్ షాపుల వద్ద శాశ్వత పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం, దానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా అనధికారిక బెల్ట్ షాపులు పుట్టుకురావడం వల్ల తమ కస్టమర్లు తగ్గిపోయి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని తెలిపారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఊరట నివ్వాల్సింది పోయి, ప్రివిలేజ్ సెస్ పేరిట తమపై అదనపు భారాన్ని మోపడం ఏమాత్రం న్యాయం కాదని ఫైర్ అవుతున్నారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రివిలేజ్ సెస్ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల సంఘం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకునే వరకు, ఈ పన్ను నిర్ణయాన్ని విరమించుకునే వరకు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లను ఓపెన్ చేయమని స్పష్టం చేశారు. తమ ప్రొటెస్త్ తీవ్రతరం చేస్తామని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బార్లు క్లోజ్ అవనుండడంతో మద్యం విక్రయాలు, రెస్టారెంట్ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేస్తుందో లేక తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటుందో వేచి చూడాలి. బార్ల బంద్ ప్రభావంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడే అవకాశం ఉండటంతో అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
