చదువుల తల్లి ఒడిలో తమ బిడ్డలు క్షేమంగా ఉంటారని ప్రతి తల్లిదండ్రులు ఎంతో ఆశతో గురుకులాలకు, హాస్టళ్లకు పంపిస్తుంటారు. కానీ, మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ తీరు చూస్తుంటే.. ఆ భరోసా కాస్తా ఇప్పుడు భయంగా మారుతోంది. ఒకవైపు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా నియామకాలు, మరోవైపు అధికారుల పర్యవేక్షణ లోపంతో పసిప్రాణాలు గాలిలో కలుస్తున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది? ఈ వరుస ఘటనల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి?
మొదటి ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో చోటుచేసుకుంది. కళాశాల వాష్‌రూమ్ వద్ద ఓ నవజాత మగ శిశువు మృతదేహం కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆరా తీస్తే.. అదే కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని బాత్రూమ్లో ప్రసవించిందని తేలింది. అయితే ఇక్కడ తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే.. ఒక విద్యార్థిని నెలల తరబడి గర్భంతో ఉన్నప్పటికీ, అక్కడున్న వార్డెన్లు, అధ్యాపకులు ఏం చేస్తున్నారు? కనీస పర్యవేక్షణ, హెల్త్ చెకప్‌లు లేకపోవడం వల్లే కదా ఈ విషాదం జరిగింది? దీనికి బాధ్యులు ఎవరని స్థానికులు నిలదీస్తున్నారు.
అసలు హాస్టళ్లలో పర్యవేక్షణ ఎందుకు లోపిస్తుందో తెలియాలంటే.. కొత్తగూడ మండల కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహం పరిస్థితిని గమనించాలి. వందలాది మంది ఆడపిల్లలకు రక్షణగా ఉండాల్సిన హాస్టల్ వార్డెన్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బాధ్యతలను.. అధికారులు ఏకంగా ఒక అటెండర్ స్థాయి గ్రేడెడ్ వర్కర్‌కు కట్టబెట్టారు. ప్రభుత్వ నిబంధనలు ఎఫ్ఆర్ 49, జీవో నెంబర్ 45 ప్రకారం సమాన క్యాడర్ ఉన్న వారికే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలి. పాఠశాలలో అర్హులైన మహిళా ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నా, వారిని కాదని ఒక అటెండర్‌కు వార్డెన్ పోస్ట్ ఇవ్వడం వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు, పైరవీలు ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవో ప్రకారమే ఇచ్చామని చెబుతున్న అధికారులు ఆ కాపీని ఎందుకు బయటపెట్టడం లేదని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఇక గంగారం మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అయితే నిబంధనల ఉల్లంఘన మరో స్థాయికి చేరింది. సాధారణంగా బాలికల గురుకులంలో, ఆశ్రమ పాఠశాలల్లో మహిళా హెడ్మాస్టర్ ఉండాలనేది కనీస నిబంధన. కానీ అధికారులు ఆ రూల్‌ను పూర్తిగా తుంగలో తొక్కారు. అదే పాఠశాలలో సీనియర్ మహిళా ఉపాధ్యాయురాలు పనిచేస్తున్నప్పటికీ, ఆమెను పక్కనబెట్టి.. బాలుర పాఠశాలలో పనిచేసే ఒక పురుష ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి బాలికల పాఠశాలకు హెడ్మాస్టర్గా కూర్చోబెట్టారు. అసలు బాలికల హాస్టల్, ఆశ్రమ పాఠశాలలో పురుష ఉద్యోగికి పెత్తనం ఇవ్వడమేంటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఆడపిల్లల భద్రతకు ఏదైనా ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
చూశారు కదా.. ఇవి కేవలం మూడు వేర్వేరు ఘటనలు మాత్రమే కావు, మహబూబాబాద్ గిరిజన సంక్షేమ శాఖలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికి నిదర్శనాలు. ఒకచోట అటెండర్‌కు వార్డెన్ పోస్ట్, మరోచోట బాలికల స్కూల్‌కు పురుష హెడ్మాస్టర్, ఇంకోచోట కళ్లముందే విద్యార్థిని ప్రసవించినా గుర్తించలేని సిబ్బంది. పైరవీలకు, ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఇలా ఇష్టారాజ్యంగా నియామకాలు చేస్తుంటే.. అమాయక గిరిజన ఆడబిడ్డల భవిష్యత్తు, భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ అక్రమ నియామకాలను రద్దు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
