Cyber Crime Alert : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను ముంచేందుకు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు. నిన్నటి దాకా ఓటీపీలు అడగడం, నకిలీ లింకులు పంపి క్లిక్ చేయించడం లాంటి పద్ధతులు వాడిన కేటుగాళ్లు, ఇప్పుడు మరో నయా మోసానికి తెరలేపారు. ఈ కొత్త తరహా డిజిటల్ క్రైమ్ పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
కేటుగాళ్లు మొదట అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి వాట్సాప్కి ఒక మెసేజ్ పంపుతారు. “మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఇంత మొత్తం కట్ అయింది.. ఈ ట్రాన్సాక్షన్ మీరు చేయకపోతే తక్షణమే స్పందించండి” అంటూ భయాందోళనకు గురిచేసేలా ఆ మెసేజ్ ఉంటుంది. అందులోనే “ఈ ట్రాన్సాక్షన్ మీరు చేయకపోతే ‘NO’ అని, ఒకవేళ మీరే చేస్తే ‘YES’ అని సమాధానం ఇవ్వండి” అని కోరతారు. తమ కష్టార్జితం ఎక్కడ పోతుందోననే కంగారులో ప్రజలు అసలు ఆ మెసేజ్ నిజమైనదో కాదో అని ఆలోచించకుండా, వెంటనే ‘NO’ అని రిప్లై పంపే ప్రమాదం ఉంది.
ఒక్కసారి బాధితులు ‘NO’ అని రిప్లై ఇవ్వగానే, నేరగాళ్లకు ఆ నంబర్ యాక్టివ్గా ఉందని, అవతలి వ్యక్తి కంగారు పడుతున్నాడని స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ తర్వాతి క్షణంలోనే విడతల వారీగా ప్రమాదకరమైన లింకులు, ఫైళ్లు పంపడం లేదా నకిలీ వెబ్సైట్ల ద్వారా పర్సనల్ డేటాను, బ్యాంకింగ్ వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు డైరెక్ట్ గా ఫోన్ కాల్స్ చేసి బ్యాంకు అధికారులమని నమ్మిస్తూ పూర్తి వివరాలు గుంజుతారు. చివరకు బాధితుడు తేరుకునేలోపే అకౌంట్లో ఉన్న డబ్బంతా గుల్ల చేస్తారు. ఈ ప్రక్రియలో ఓటీపీలు కూడా అడగకుండానే విభిన్న సాంకేతిక మార్గాల్లో డేటా చోరీకి పాల్పడుతున్నారు.
ఈ తరహా కొత్త సైబర్ నేరాలపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటీవల ఈ తరహా నయా మోసానికి గురైన ఒక బాధితుడి ఉదాహరణను కూడా ఆయన తన ట్వీట్లో ప్రస్తావించారు. ఎలాంటి ధృవీకరణ లేకుండా పరిచయం లేని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించడం అత్యంత ప్రమాదకరమని ఆయన స్పష్టం చేశారు. ఇంతకు సజ్జనార్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం.
