మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అరికట్టేందుకు ఎన్ని చట్టాలొచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున మరో నిర్భయ ఘటన వెలుగుచూసింది. కిస్మత్‌పూర్‌లో జరిగిన ఈ దురాగతం అందర్నీ కలచి వేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో నిర్భయ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి..మర్మాంగాలపై దాడి చేసి హత్య చేసిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే యాకుత్‌పురా నుంచి హైదర్‌గూడ కల్లు కాంపౌండ్‌లో కల్లు సేవించిన ఓ మహిళ మత్తుతో రోడ్డువారన పడిపోయింది. అటువైపు వెళ్తున్న టోలీచౌకీకు చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆ మహిళను బలవంతంగా ఎక్కించుకుని కిస్మత్‌పూర్ బ్రిడ్జి వద్ద మద్యం సేవించారు. ఆ తరువాత ఆ మహిళపై ఒకరి తరువాత మరొకరిగా లైంగిక దాడికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన ఆ మహిళ ప్రతిఘటిస్తుంటే ఆమెను వివస్త్రను చేసి కర్రలతో మర్మాంగంపై దాడి చేసి పాశవికంగా హత్య చేశారు.
కిస్మత్‌పూర్ నాలాలో ఓ మహిళ మృతదేహం కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మహిళపై లైంగిక దాడి, మర్మాంగంపై గాయాలుండటంతో పోలీసులు దర్యాప్తు తీవ్రం చేశారు. కిస్మత్‌పూర్ వైపు వచ్చే వాహనాలను సీసీటీవీ ద్వారా పరిశీలించారు. ఈ క్రమంలో హైదర్‌గూడ నుంచి ఆ మహిళను ఓ ఆటోలో తీసుకెళ్లడం కన్పించింది. ఆ ఆటో నెంబర్ ఆధారంగా ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నారు.
మృతదేహం కుళ్లినట్టుండటంతో హత్య జరిగిన రెండు మూడ్రోజులు కావచ్చని తెలుస్తోంది. ఫోరెన్సిక్ నిపుణుల నివేదికతో ఆ మహిళను ఎంత దారుణంగా హింసించారో తెలుస్తోంది. ప్రస్తుతం కేసు రాజేంద్ర నగర్ పోలీసుల దర్యాప్తులో ఉంది.