ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బిగ్ అప్‌డేట్ ఒకటి విడుదలైంది. దక్షిణాది నుంచి ముఖ్యంగా టాలీవుడ్ దర్శకుడు మోదీ బయోపిక్ తెరకెక్కించనున్నాడు. దీనికి సంబంధించి ఇవాళ విడుదలైన పోస్టర్ వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీకు ఇవాళ్టితో 75 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని ప్రముఖులు, సెలెబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ టాలీవుడ్ దర్శకుడు ఆయన బయోపిక్ ప్రకటించారు. ఈ బయోపిక్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి ఇవాళ విడుదల చేసిన పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. మా వందే పేరుతో వస్తున్న మోదీ బయోపిక్‌లో దక్షిణాదిలోని ప్రముఖ టెక్నీషియన్లు పనిచేయనున్నారు.
టాలీవుడ్ దర్శకుడు సీహెచ్ క్రాంతి కుమార్ మోదీ బయోపిక్ మా వందే తెరకెక్కించనున్నాడు. ఇక మోదీ పాత్రను మలయాళ హీరో ఉన్ని ముకుందన్ పోషించనుండగా కేజీఎఫ్ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందించనున్నాడు. ఇక సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించనున్నాడు. మా వందే పేరుతో తెరకెక్కనున్న ఈ బయోపిక్ పోస్టర్‌లో..ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది అంటూ క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం. మోదీ బయోపిక్ మదర్ సెంటిమెంట్ నేపధ్యంలో రానుందనే వార్తలు విన్పిస్తున్నాయి. మోదీ బయోపిక్ ఇది రెండవది. గతంలో 2019లో పీఎం నరేంద్ర మోదీ పేరుతో ఓ బయోపిక్ విడుదలైంది.