ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు వీడే పరిస్థితి కన్పించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా రానున్న 5-6 రోజులు భారీ వర్షాలు తప్పవని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా తీరంలో తీరం దాటింది. రానున్న 12 గంటల్లో ఇది కాస్తా బలహీనపడి అల్పపీడనంగా మారవచ్చు. మరోవైపు రుతు పవన ద్రోణి సూరత్, డయ్యూ మీదుగా విస్తరించింది. అంతేకాకుండా ఆగస్టు 24న మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరించింది. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రానున్న 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి.
ఉత్తర కోస్తా, యానాం జిల్లాల్లో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు మాత్రం వీస్తాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. బలమైన ఈదురు గాలుల కారణంగా విద్యుత్ తీగలు, చెట్లు పడిపోవచ్చు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఆరుబయట, చెట్లు, విద్యుత్ టవర్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచిస్తోంది. మొత్తానికి రానున్న 5 రోజుల్లో ఏపీ అంతా వర్షాలు పడనున్నాయి.