బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో 3-4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఫలితంగా ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులిచ్చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినా ఏపీలో దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విశాఖపట్నం సమీపంలో కేంద్రీకృతం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దంచి కొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమౌతున్నాయి. భారీ వర్షాలు మరో 3-4 రోజులు కొనసాగవచ్చు. ఈ క్రమంలో ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో స్కూళ్లకు సెలవులిచ్చారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజులు స్కూళ్లకు సెలవులిచ్చారు. ఇక ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు సైతం సెలవులిచ్చేశారు. వర్షాల పరిస్థితిని బట్టి సెలవులు పొడిగించడం లేదా తగ్గించడం చేయవచ్చు. అయితే అల్పపీడనం క్రమంగా బలపడుతున్నందున వర్షాలు మరింత తీవ్రం కావచ్చు.
ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇక కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికీ ఏపీ అంతా దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. గుంటూరు నుంచి విశాఖపట్నం వరకూ భారీ వర్షాలు పడుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న అల్పపీడనం కాకుండా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది కాస్తా వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడనుంది. అందుకే రానున్న 3 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ అయింది.