భారత్ క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోని అందించిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాటర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఎన్నో మ్యాచుల్లో జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. సారథిగా అద్భుతంగా రాణించిన ధోని.. వన్డే, టీ20 ప్రపంచ కప్‌లను భారత్‌కు అందించాడు. టెస్టుల్లోనూ టీమిండియాను అగ్రస్థానానికి చేర్చాడు. పెర్ఫార్మెన్స్‌తో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న ప్లేయర్లకు అండగా నిలబడ్డాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిబ్బరంగా ఉంటూ, జట్టును ముందుండి నడిపిస్తూ కెప్టెన్ కూల్ అనిపించుకున్నాడు. అలాంటి ధోనీపై మాజీ కోచ్ రవిశాస్త్రి సీరియస్ అయ్యాడట. ఇప్పుడీ వార్త నెట్టంట హల్‌చల్‌గా మారింది. టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ తన తాజా పుస్తకం ‘కోచింగ్ బియాండ్: మై డేస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్’లో ఈ విషయాన్ని రాసుకొచ్చాడు. ఈ బుక్‌లో ఇప్పటివరకూ క్రికెట్ అభిమానులకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ధోని మీద అప్పటి కోచ్ రవిశాస్త్రి సీరియస్ అవ్వడం కూడా ఇందులో ఒకటి.
ఇంగ్లాండ్‌తో 2018లో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా ఈ ఘటన జరిగిందట. తొలి వన్డేలో భారత జట్టు 8 వికెట్లతో గెలిచింది. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం 86 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కనీసం ఫైట్ చేయకుండానే భారత బ్యాటర్లు చేతులెత్తేయడం కోచ్ రవిశాస్త్రికి నచ్చలేదని శ్రీధర్ ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి, రైనా క్రీజులో ఉన్నంత వరకు ఆశలు సజీవంగానే ఉన్నా.. వాళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడం, అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ధోని గెలుపు కోసం ఏమాత్రం ప్రయత్నించకుండా నెమ్మదిగా ఆడాడు. చివరికి 59 బంతుల్లో 37 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇదే రవిశాస్త్రికి కోపం తెప్పించిందట.
‘మూడో వన్డేకు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో రవిశాస్త్రి మీటింగ్ పెట్టాడు. అప్పుడు ధోని కళ్లలోకి చూస్తూ రవి.. ‘మీరు ఎవ్వరైనా సరే, గెలిచేందుకు ప్రయత్నించకుండా మరో మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి మళ్లీ రాకూడదు. నా కోచింగ్‌లో ఇలాంటిది అస్సలు జరగకూడదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే మాత్రం వారికి అదే చివరి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ ఓడిపోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. కానీ ఇలా ఓడిపోకూడదు’ అని రవిశాస్త్రి అన్నట్లు శ్రీధరన్ బుక్‌లో రాసుకొచ్చాడు. మరి, ఫైట్ చేయకుండా ఓడిపోవడం సరికాదంటూ ధోనీపై రవిశాస్త్రి సీరియస్ అయిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.