అన్నా చెల్లెళ్ల బంధానికి గుర్తుగా అత్యంత ఘనంగా జరుపుకునే రాఖీ వచ్చేసింది. రేపు ఆగస్టు 9 శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలో అసలు రాఖీ పండుగ ఎప్పుడు మొదలైంది, ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం.
ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ ఉంటుంది. ఈ ఏడాది అంటే 2025లో ఆగస్టు 9న రేపు జరుపుకోనున్నారు. అక్కాచెల్లెళ్లు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి ఆరోగ్యంగా ఉండాలని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుంటారు. అదే సమయంలో ఆన్నా లేదా తమ్ముడు తమను రక్షిస్తాడని నమ్ముతారు. ఈ నేపధ్యంలో రాఖీ పండుగ నేపధ్యం, పూర్వాపరాలు, ప్రాధాన్యత గురించిన వివరాలు మీ కోసం. రాఖీ పండుగ వెనుక పౌరాణిక గాధ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.
రాఖీ వెనుక కధ
మత్యుదేవతగా భావించే యమరాజుని యమున తన సోదరుడిగా భావించి ఓసారి దీర్ఘాయుష్షుకై రక్షాసూత్రాన్ని కడుతుంది. అందుకు ప్రతిగా యమునకు అమరత్వం ప్రసాదిస్తాడు యమరాజు. అంటే తన ప్రాణాన్ని యమరాజు విడిచిపెట్టాడు. అప్పటి నుంచి ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున సోదరునికి సోదరి రాఖీ కట్టడం ఆనవాయితీగా మారింది. ఆ సోదరుడు జీవితాంతం ఆ సోదరిని రక్షిస్తాడని రాఖీ కట్టడం వెనుక ఉన్న ఆంతర్యం.
మరో పౌరాణిక గాధ కూడా ప్రచారంలో ఉంది. భవిష్య పురాణం ప్రకారం ఇంద్రుని భార్య శుచి భర్తకు రాఖీ కడుతుంది. దేవతలు, రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు గెలిచే క్రమంలో ఇంద్రుని భార్య శుచి…బృహస్పతి కోరిక మేరకు ఇంద్రుని చేతికి రక్షణగా రక్షాసూత్రం కడుతుంది. ఆ తరువాత రాక్షసులపై దేవతలు విజయం సాధిస్తారు. అప్పటి నుంచి రక్షాబంధన్ జరుపుకుంటున్నారు. ఇలా విభిన్నమైన కధలు ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రతీ ఏటా శ్రావణ పౌర్ణమికి మాత్రం రక్షాబంధన్ జరుపుకుంటుంటారు.