హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణకు బిగ్ అలర్ట్. రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరో 4 రోజులు భారీ వర్షాలు తప్పవని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. ఓ గంట వర్షం పడితే చాలు రోడ్లన్నీ చెరువులుగా మారి ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో నగరంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. గత 2-3 ఏళ్లలో ఇంత భారీ వర్షం పడలేదంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి వస్తున్న అలర్ట్ ఆందోళన కల్గిస్తోంది. రానున్న రెండు గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
రానున్న 2 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం
రానున్న రెండు గంటల్లో హైదరాబాద్‌లోని పఠాన్ చెరువు, లింగంపల్లి, బీరంగూడ, అమీన్ పూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడవచ్చని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. మద్యాహ్నం తరువాత నగరమంతా వర్షాలు పడవచ్చు. టోలీచౌకి, షేక్ పేట్, మెహదీపట్నం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.
ఈ జిల్లాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రానున్న 2 గంటలు అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక నగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి,, గద్వాల్, నారాయణ పేట్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మరో 4 రోజులు భారీ వర్షాలు తప్పేట్టు లేవు. ఈ క్రమంలో అత్యవసరం అయితే తప్ప ఇవాళ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.