కొబ్బరి నీళ్లను అమృతంతో పోలుస్తుంటారు. ఎందుకంటే ఆరోగ్యానికి అంత మంచిది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగితే ఏమౌతుంది. ఏయే మార్పులు కన్పిస్తాయో తెలుసుకుందాం…
కొబ్బరి నీళ్లను బెస్ట్ హైడ్రేట్ డ్రింక్‌గా పిలుస్తారు. వేసవిలో కొబ్బరి నీళ్లకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగేవారిలో ఊహించని ఆరోగ్యపరమైన మార్పులు కన్పిస్తాయి. ముఖ్యంగా గర్భిణీలు రోజూ కొబ్బరి నీళ్లు సేవిస్తే చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పోషకాలకు కేరాఫ్ కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు, పైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కావల్సినంతగా ఉంటాయి. అందుకే రోజూ ఈ నీళ్లను తాగడం వల్ల తల్లితో పాటు గర్భంలో శిశువుకి సైతం చాలా లాభదాయకంగా ఉంటుంది. బిడ్డకు అవసరమైన పోషకాలు కచ్చితంగా లభిస్తాయి. గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే వాంతులు, నీరసం, ఇమ్యూనిటీ తగ్గడం వంటి సమస్యలకు కొబ్బరి నీళ్లు మంచి పరిష్కారం. ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలసట, నీరసం తొలగిపోతాయి. వికారం తగ్గుతుంది.
అదే సమయంలో ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దాంతో మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. డీ హైడ్రేషన్ సమస్య ఉండకపోవడంతో తల తిరగడం లేదా తలనొప్పి వంటి సమస్యలు మాయమౌతాయి. బాడీ డీటాక్స్ అవడంతో యూరినరీ ట్రాక్‌ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. గర్భధారణ సమయంలో మహిళలకు సాధారణంగా పుల్లని తేన్పులు వస్తుంటాయి. ఈ సమస్యకు కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉండటంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గర్భిణీలు ప్రధానంగా చూసుకోవల్సింది ఈ సమస్యనే.