నిత్యం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్యసమస్యలకు ప్రధాన కారణం లైఫ్‌స్టైల్ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనకు తెలియకుండా చేసే కొన్ని రకాల అలవాట్లు కొంప ముంచే ప్రమాదకర వ్యాధులకు కారణమౌతుంటాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
పొగ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. చాలా సందర్భాల్లో తరచూ చూసే వార్నింగ్ ఇది. అదే సమయంలో అతిగా టీ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇది చాలదన్నట్టు కొందరికి ఈ రెండూ కలిపి తీసుకోవడం ఓ అలవాటు. స్టైల్‌గా ఓ చేతితో స్మోక్ చేస్తూ..మరో చేతితో టీ తాగడం మనం చూస్తుంటాం. ఈ అలవాటు ఆ క్షణానికి బాగుంటుంది అంతే. క్రమం తప్పకుండా ఇదే పనిచేస్తే మాత్రం మీ శరీరం షెడ్డుకు వెళ్లడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వాస్తవానికి టీ ఎక్కువగా తాగడం వల్ల అందులో ఉండే విష పదార్ధాలు ఆరోగ్యానికి హాని కల్గిస్తాయి. టీ రోజుకు 1-2 కప్పులకు మించి తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మిల్క్ టీ అస్సలు మంచిది కాదు. చాలామంది వైద్యులు కూడా మిల్క్ టీకు దూరంగా ఉండమని హెచ్చరిస్తుంటారు. ఇక సిగరెట్ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సిగరెట్‌లో ఉండే నికోటిన్ అత్యంత ప్రమాదకరమైంది.
టీ-సిగరెట్ కలిపి తాగితే ఏం జరుగుతుంది
ఇక చాలామందిలో టీ తాగుతూ స్మోక్ చేసే అలవాటు ఉంటుంది. ఇది మరింత ప్రమాదకరమైంది. ఈ రెంటి కాంబినేషన్ కారణంగా సంతానలేమి సమస్యలు, కడుపులో పుండ్లు, జీర్ణ సంబంధిత సమస్యలు, లంగ్స్ కుంచించుకుపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు రావచ్చు. గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అన్నింటికీ మించి టీలో ఉండే టాక్సిన్స్ అంటే విష పదార్ధాలకు సిగరెట్ పొగ తోడయినప్పుడు కేన్సర్‌కు దారి తీయవచ్చు. ఓ అధ్యయనం ప్రకారం సిగెరెట్ స్మోక్ చేస్తూ టీ తాగే అలవాటుంటే కేన్సర్ అవకాశాలు 30 శాతం పెరుగుతాయట.