క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఇది టెన్షన్ పెట్టే వార్త కావచ్చు. త్వరలో వన్డే క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవచ్చనే వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ పుకార్లలో నిజమెంత ఉందో గానీ ఓ ఫోటో ఈ ప్రచారానికి కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025 తరువాత క్రికెట్ నుంచి కాస్త దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఇళ్లు తీసుకుని కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఇటీవల వింబుల్డన్ ఓపెన్ సందర్భంగా సెంటర్ కోర్టులో ఓ ఫోటో తీసుకుని కన్పించాడు. ఈ ఫోటోనే ఇప్పుడు కొత్త కొత్త పుకార్లకు, వివిధ రకాల ఊహాగానాలకు కారణంగా మారింది. ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ లుక్ అందుకు కారణం. ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ తెల్లటి గెడ్డంతో ఉన్నాడు. 36 ఏళ్ల విరాట్ కోహ్లీ 37లో అడుగుపెట్టనున్నాడు. ఈ క్రమంలో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కూడా విరామం ప్రకటిస్తాడనే వార్తలు మొదలయ్యాయి. ఈ ఫోటోకు వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా…అయితే విరాట్ కోహ్లీ చేసిన సరదా వ్యాఖ్యలు ఇందుకు కారణంం.
తెల్ల గెడ్డానికి కోహ్లీ రిటైర్మెంట్‌కు సంబంధం ఏంటి
జూలై నెలలో లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ కొన్ని సరదా వ్యాఖ్యలు చేశాడు. నేను రెండ్రోజుల క్రితం నా గెడ్డానికి రంగు వేశాను. నాలుగు రోజులకోసారి గెడ్డానికి రంగు వేసే సమయం వచ్చిందంటే ఇక మీకు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చినట్టేనని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఫ్యాన్స్ ఇప్పుడీ వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుని…క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా అంటూ ఊహాగానాలు ప్రారంభించేశారు. అయితే మరి కొందరు మాత్రం 2027 ప్రపంచకప్ కంటే ముందు విరాట్ కోహ్లీ రిటైర్ అవడని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి…విరాట్ తెల్ల గెడ్డానికి రిటైర్మెంట్ కు సంబంధం ఉందో లేదో.