పేదరికం శాశ్వతం కాదు. సరైన ఆలోచన, కసి ఉంటే ఏదీ అసాధ్యం కానే కాదు. పేదరికంతో చదువు వదిలేసి పుట్‌పాత్‌పై బట్టలమ్ముకున్న ఆ వ్యక్తి…ఏకంగా 1000 కోట్ల సామ్యాజ్యం నిర్మించాడు. అతన్ని అలా నడిపించిది ఓ సినిమా అంటే నమ్మగలరా..
సినిమా జీవితం కాదని అంటారు. నిజ జీవితంలో ఉన్నవే సినిమాల్లో చూపిస్తారని మరి కొందరంటారు. కానీ ఒక్కసారి సినిమాలే ప్రేరణగా నిలుస్తాయి. పేదరికంతో చదువు మానేసి ఫుట్‌పాత్‌పై బట్టలమ్ముకున్న ఆ వ్యక్తి విషయంలో అదే జరిగింది. ఇంట్లో తినేందుకు తిండి సరిగ్గా లేక స్కూల్ ఫీజు కట్టలేక చదువు మానేశాడు. 17 ఏళ్ల వయస్సులో బెంగళూరు నుంచి ముంబైకు బతుకుదెరువు కోసం వెళ్లి తిరిగొచ్చేశాడు. జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతో ఉన్నప్పుడు అతడు చూసిన అమితాబ్ బచ్చన్ త్రిశూల్ సినిమా స్పూర్తినిచ్చింది. సినిమాల్లో హీరో చేయగలిగినప్పుడు తానెందుకు చేయలేననుకున్నాడు. సినిమాల నుంచి ఏది గ్రహించాలో అదే తీసుకున్నాడు. అంతే ఆలోచన మారింది. గమ్యం మార్చుకున్నాడు.
10 వేలతో మొదలెట్టి 1000 కోట్ల వ్యాపారంలో
ఇంట్లో దాచుకున్న 10 వేల రూపాయలతో తమిళనాడులోని ఓ బట్టల కంపెనీలో రిజెక్ట్ చేసిన షర్టులు చౌక ధరకు కొన్నాడు. ముఖ్యంగా ఫ్యాక్టరీ సిబ్బందిని టార్గెట్ చేసి బ్లూ అండ్ వైట్ షర్టులు ఫుట్‌పాత్‌పై అమ్మడం మొదలెట్టి క్రమంగా బూట్లు, ఇంట్లో వాడే వస్తువులు అమ్మడం ప్రారంభించాడు. అలా ఒకటి కాదు రెండు కాదు..అమ్మడానికి ఏవి అర్హమో అన్నీ విక్రయించసాగాడు. అన్నింటిలో లాభాలు ఆర్జించాడు. 1991లో అక్షయ్ ఎంటర్‌ప్రైజస్ పేరుతో ప్యాకేజింగ్ రంగంలో అడుగెట్టాడు. 1998లో ఎంసీఎస్ లాజిస్టిక్స్ బిజినెస్ మొదలెట్టాడు. ఆ తరువాత జాలా బేవరేజెస్ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ తీసుకొచ్చాడు. పర్పుల్ హేజ్ పేరుతో వెల్‌నెస్, సెలూన్ చైన్, న్యూట్రి ప్లానెట్ పేరుతో హెల్త్ ఫుడ్స్ వంటివి నడుపుతున్నాడు.
వ్యాపారానికి ఏవీ అనర్హం కాదన్నట్టుగా ఎప్పుడు ఏ వ్యాపారం లాభసాటిగా ఉందో గ్రహిస్తూ ఆ వ్యాపారాన్ని ప్రారంభించేవాడు. ఇంతకీ ఇతని పేరు చెప్పనే లేదు కదూ.. బెంగళూరులోని పేద దళిత కుటుంబంలో జన్మించిన రాజా నాయక్. ఇంత సంపాదించినా తాను నడిచొచ్చిన దారిని మర్చిపోలేదు. కుల వివక్షతో చెల్లెలికి ఓ స్కూల్ యాజమాన్యం సీటు నిరాకరించడంతో సొంతంగా కళానికేతన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓ హైస్కూల్, నర్శింగ్ కళాశాల ప్రారంభించాడు. ఇప్పుడు 1000 కోట్లకు పైగా ఉన్న వ్యాపార సామ్యాజ్యానికి అధిపతి.