టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సమంగా ముగిసింది. సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఫామ్‌లో ఉన్న ఓ క్రికెటర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. చాలామంది సచిన్ టెండూల్కర్‌కు పోటీ అంటున్నారు. అతడి రికార్డులు ఇతడే బద్దలు కొడతాడంటున్నారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ తరువాత ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ పేరు మార్మోగిపోతోంది. చాలా మంది క్రికెట్ విశ్లేషకులైతే ఇతడిని సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక 51 సెంచరీల సచిన్ రికార్డును ఇతనే బద్దలు కొడతాడంటున్నారు. జో రూట్‌లో అంత విషయం ఉందా, ఎందుకు అంతా సచిన్‌తో పోలుస్తున్నారు, నిజంగా అతడిలో అంత దమ్ముందా, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.
సచిన్ వర్సెస్ జో రూట్ రికార్డులు
34 ఏళ్ల జో రూట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్. ఇటీవల 39వ టెస్ట్ సెంచరీ చేశాడు. మరో 12 సెంచరీలు సాధిస్తే సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ అవుతుంది. ఇక పరుగుల విషయంలో అయితే ఇప్పటికి 13,500 పరుగులు చేసిన జో రూట్..మరో 2400 పరుగులు చేస్తే సచిన్ చేసిన 15,921 పరుగుల రికార్డు బ్రేక్ కాగలదు. 2012 నుంచి ఇప్పటి వరకు 135 టెస్టులు ఆడిన జో రూట్ మరో 3-4 ఏళ్లు ఆడితే చాలు..సచిన్ రికార్డులు అధిగమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
సచిన్ వర్సెస్ జో రూట్ మధ్య తేడా
సచిన్ టెండూల్కర్ సగటున ప్రతి 6.5 ఇన్నింగ్స్‌లకు ఓ సెంచరీ నమోదు చేస్తే జో రూట్ ప్రతి 7.4 ఇన్నింగ్స్‌లకు ఓ సెంచరీ చేస్తున్నాడు. సచిన్ టెండూల్కర్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఎప్పుడూ ఆడలేదు. జో రూట్‌కు ఆ అనుభవం ఉండటమే కాకుండా WTCలో 6 వేల పరుగులు చేసిన ఘనత ఉంది. టెండూల్కర్ స్వదేశంలో అత్యధికంగా 22 సెంచరీలు చేస్తే జో రూట్ 24 శతకాలు నమోదు చేశాడు.
సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 11 సెంచరీలు చేయగా జో రూట్ ఇండియాపై 13 సెంచరీలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ తన సమయంలో అరితేరిన బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు జో రూట్ అధునిక క్రికెట్ ఆడుతున్నాడు. డీఆర్ఎస్, కఠినమైన పిచ్‌లతో నెగ్గుకొస్తున్నాడు. జో రూట్ మరో 20-22 టెస్టులు ఆడగలిగితే సచిన్ టెండూల్కర్ రికార్డులు అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. సచిన్‌ను జో రూట్‌తోనే ఎందుకు పోల్చాల్సి వస్తుందంటే సమీపంలో మరో క్రికెటర్ ఎవరూ లేరు.