తమిళ నటుడు ధనుష్ తన రాజకీయ రంగప్రవేశం, బీజేపీ మద్దతుపై స్పందించారు. బీజేపీకీ బీ టీమ్ అంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.
తమిళ సినీ నటుడు ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ గత కొంతకాలంగా జోరందుకుంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో ధనుష్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ పేరును ఎన్నికల సంఘం వద్ద కూడా నమోదు చేయించుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ధనుష్ రాజకీయాల్లోకి రావడానికి బీజేపీ మద్దతు ఉందని, ఆయన్ను వెనుకుండి నడిపిస్తున్నది కమలం పార్టీనే అంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా ఆయన స్పందించారు. తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టం చేశారు.
తన తాజా చిత్రం ‘ఓం’ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్ ఈ అంశంపై మాట్లాడుతూ తన గురించి అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయని, కొందరు తన వెనుక ఉన్నారని, మరికొందరు తనకు మద్దతు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తనకు ఏ వ్యక్తి లేదా సంస్థ ప్రత్యేకంగా మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
అయితే తనకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని, అభిమానులు తన వెనుక ఉన్నారని, ప్రజలు తనకు అండగా ఉన్నారని ధనుష్ తెలిపారు. దేవుడే తనను నడిపిస్తున్నాడని, అభిమానులు తనకు బలమని స్పష్టం చేశారు. ప్రజలే తనకు అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించకపోయినా, తనకు ఏ రాజకీయ పార్టీ ప్రత్యేక మద్దతు లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం ద్రవిడ పాలిటిక్స్ లో ఆసక్తిని రేపుతోంది.
ప్రజలకు ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు, సామాజిక సమస్యలకు న్యాయ సలహాలను అందించేందుకు తమిళనాడు వ్యాప్తంగా 3 వేల మంది న్యాయ సలహాదారులను నియమించాలని, ఇందుకు సంబంధించిన వ్యవస్థను జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలని ధనుష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో సినీ కెరీర్ లో దుమ్ము దులిపిన ధనుష్ భవిష్యత్ లో రాజకీయ రంగంలోనూ రప్ఫాడించబోతున్నారని ఆయన అభిమాను ధీమా వ్యక్తం చేస్తున్నారు.
