ప్రస్తుతం దేశాన్ని వర్షాలు కుమ్మేస్తున్నాయి. పల్లెటూర్లు మాత్రమే కాదు, పెద్ద పెద్ద నగరాలు కూడా జలమయం అయిపోతున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీని కారణంగా.. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాజెక్ట్స్ లో వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో ఓ అద్భుతం చోటు చేసుకుంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.. కొడవలూరు మండలంలోని గండవరం గ్రామంలోని పైడేరు కాలువకు వరదలు పోటెత్తాయి. అయితే.., ఈ వరదల్లో ఎక్కడ నుండో ఓ గంగమ్మ విగ్రహం కొట్టుకొచ్చింది. అచ్చం భక్తులు ప్రతిష్టించినట్టే ఆ విగ్రహం కాలువ ఎత్తు భాగంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఇదంతా ఆ గంగమ్మ తల్లి మహిమేనని పరవశించిపోతున్నారు.
తమ ఊరికి గంగమ్మ వచ్చిందని గండవరం గ్రామస్థులు పొంగిపోతున్నారు. వరద ఉదృతకి భారీ చెట్లు, కల్వర్టులు కూడా ఆగవు. అలాంటిది గంగమ్మ విగ్రహం మాత్రం చెక్కు చెదరకుండా ఇలా నిలబడటం ఆ గంగమ్మ లీల కాక మరేంటి అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వరి సాగు ఎక్కువ. ఇలా వరదల్లో గంగమ్మ తల్లి ప్రత్యక్షం అవ్వడంతో.. ఈసారి నీటికి ఎలాంటి లోటు ఉండదని.., మా రైతులకు ఆ మాట చెప్పడానికే గంగమ్మ తల్లి ఇలా స్వయంగా తమ గ్రామానికి కదిలొచ్చిందని గ్రామస్థులు నమ్మతున్నారు. అధికారులు మాత్రం వరద ఉదృతి తగ్గాక, అమ్మవారి విగ్రహ మిస్టరీ ఏమిటో తెలుసుకుంటామని చెప్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.