బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా బలపడింది. ఫలితంగా రానున్న 4-5 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ముందస్తుగా ప్రవేశించినా ఆశించిన వర్షపాతం కురవలేదు. కానీ గత వారం రోజులుగా సాధారణానికి మించి నమోదవుతోంది. మొన్నటి వరకు లోటు వర్షపాతం ఎదుర్కొన్న గుంటూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, పల్నాడు, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ఇప్పుడు అధిక వర్షాలు కురుస్తున్నాయి. మూడ్రోజులుగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గుంటూరులో అత్యధికంగా 40.6 శాతం వర్షపాతం నమోదైంది. నిన్న సాయంత్రం విశాఖ జిల్లా పెందుర్తిలో అత్యధికంగా 8.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటికే వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
రానున్న 4 రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, గంగవరం, కళింగపట్నం పోర్టులకు మూడో నెంబర్ హెచ్చరిక జారీ అయింది. అల్పపీడనం కారణంగా నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారి ఈ నెలాఖరు వరకూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు. మత్స్యకారుల్ని సముద్రంలో వేటకు వెళ్లవద్దంటున్నారు.