బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి వివాదం అంతకంతకూ పెరుగుతుండటంతో కీలక నేతలు రంగంలో దిగారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉండటంతో ఇరువురి మధ్య రాజీ కోసం ప్రయత్నాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కూటమిలో ఉన్న కారణంగా మెగా బ్రదర్స్ ఇద్దరూ మౌనం వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వేడి రగుల్చుతున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా దీటుగా కౌంటర్ ఇచ్చారు. బాలయ్యకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను సాదరంగా గౌరవించారని పేర్కొన్నారు. దీంతో చిరంజీవిని జగన్ అవమానించారంటూ పవన్, నాగబాబు సహా జనసైనికులు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. బాలయ్య తన వ్యాఖ్యలతో అటు చిరంజీవిని ఇటు జగన్‌ను అవమానించే విధంగా మాట్లాడారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటు చిరంజీవి ఫ్యాన్స్ కూడా బాలయ్యపై గుర్రుగా ఉంది. ఇంత జరుగుతున్నా మిగిలిన ఇద్దరు మెగా బ్రదర్స్ స్పందించడం లేదు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న బాలయ్య, ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు మౌనం వహిస్తున్నారు. అన్నయ్య చిరంజీవిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసినా స్పందించలేకున్నారు.
అటు సొంత అన్నయ్య చిరంజీవి, ఇటు కూటమి ప్రభుత్వం కావడంతో పవన్ అండ్ కో మౌనం వహించడమే మేలని భావిస్తున్నట్టున్నారు. ఎటు మాట్లాడాలో, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు. పవన్ ఆలోచన, వ్యూహం ఏంటో అర్ధం కావడం లేదు జన సైనికులకు. చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం సమావేశాలు ఏర్పాటు చేసి బాలయ్యపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బాలయ్య వ్యాఖ్యలకు నిరసనలు చేసేందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రేపు అంటే ఆదివారం సమావేశం కానున్నారు. బాలయ్య వ్యాఖ్యలకు చిరంజీవి ఇచ్చిన సమాదానం, పేర్ని నాని వ్యాఖ్యలతో రెండు విషయాలపై స్పష్టత వచ్చింది. నాడు చిరంజీవిని జగన్ అవమానించారనడంలో వాస్తవం లేదని తేలింది. ఇటు బాలకృష్ణ స్వయంగా జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించారని కూడా అర్ధమైంది. మొత్తానికి బాలయ్య వర్సెస్ చిరంజీవి వ్యవహారం కూటమి ప్రభుత్వానికి ఇరకాటంగా మారడంతో సర్ది చెప్పేందుకు, అవసరమైతే రాజీ కుదిర్చేందుకు కీలక నేతలు రంగంలో దిగినట్టు తెలుస్తోంది.