రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా మెగాస్టార్ చిరంజీవి నిజమైన హీరో ఎందుకో మరోసారి నిరూపితమైంది. ఓ అభిమాని పట్ల చిరు చూపించిన అభిమానం నెట్టింట ప్రశంసలు కురిపిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల 70వ జన్మదినోత్సవం జరుపుకున్న చిరంజీవి అంటే పడి చచ్చే ఫ్యాన్స్ చాలా ఉన్నారు. నటనకే కాకుండా అతను చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అతని స్థాయిని పెంచుతుంటాయి. అవసరమున్నవారిని ఆదుకోవడం, అభిమానులపై ప్రత్యేక ప్రేమ కురిపిస్తుండటంతో వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అన్పించుకుంటున్నారు. చిరు అంటే ఆ అభిమానికి ఉన్న అభిమానం ఎలాంటిదంటే వందల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి వచ్చేలా చేసింది.
చిరంజీవి అంటే పడి చచ్చే ఈ అభిమాని పేరు రాజేశ్వరి. ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, కుమార్తె. ఈమె తన సొంతూరు ఏపీలోని ఆదోని నుంచి చిరంజీవిని కలిసేందుకు హైదరాబాద్‌కు సైకిల్‌పై చేరుకుంది. తన కోసం ఏకంగా 300 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వచ్చిన ఆమె పట్టుదలను, అభిమానాన్ని చూసిన చిరంజీవి చలించిపోయారు. సాదరంగా ఆమెను ఇంటికి ఆహ్వానించి…గౌరవించారు. అటు ఆమె కూడా చిరంజీవికి రాఖీ కట్టడంతో రిటర్న్ గిఫ్ట్‌గా ఆమెకు ఓ ట్రెడిషనల్ చీరను బహుకరించాడు.
అంతేకాకుండా ఆమె పిల్లల చదువు బాధ్యతల్ని తీసుకుంటానని హామీ ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. చిరంజీవి అంటే ఫ్యాన్స్ ఎంత పడిఛస్తారనేదానికి రాజేశ్వరి నిదర్శనమైతే..ఫ్యాన్స్ పట్ల చిరంజీవి చూపించే కృతజ్ఞతకు కూడా ఇదే ఉదాహరణ. అందుకే రీల్ లైఫ్‌లోనే కాదు..రియల్ లైఫ్ హీరో అన్పించుకుంటూనే ఉన్నారు చిరు.